డిజిటల్‌ ప్రకటనలకూ ఓ లెక్కుంది! 

Digital advertising also has a calculation - Sakshi

యూట్యూబ్‌లో ఒక్క వ్యూకు 30 పైసల చొప్పున రేటు

వెబ్‌సైట్‌లలో ప్రకటనకు వెయ్యి ఇంప్రెషన్‌లకు రూ.35 

బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు, థియేటర్‌లలో ప్రకటనలకు ప్రత్యేక ధరలు

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ పాలసీ ప్రకారం ధరల నిర్ణయం

అభ్యర్థుల ఖర్చుల కిందనే లెక్కిస్తున్న ఎన్నికల అధికారులు

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పత్రికలో ప్రకటన ఇస్తే ప్రకటన సైజును బట్టి దాని ధరను అభ్యర్థుల ఖర్చుల కింద లెక్కిస్తారు. మరి యూట్యూబ్, వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ఎక్స్‌ (ట్విట్టర్‌)లో అభ్యర్థులు ఇచ్చే ప్రకటనల పరిస్థితి ఏంటి? వాటికీ ఓ లెక్కుంది అంటోంది ఎన్నికల సంఘం.

సోషల్‌ మీడియాలో అభ్యర్థులు ఇస్తున్న ప్రకటనలను ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఆ ప్రకటనల వ్యయాన్ని లెక్కించి వారి ఎన్నికల ఖర్చు పద్దుల్లో నమోదు చేస్తున్నారు. వీటి రేట్లను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ పాలసీ మేరకు ఈసీ నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేసింది. 

యూట్యూబ్‌లో వ్యూస్‌ను బట్టి
యూట్యూబ్‌లో అభ్యర్థుల ప్రకటనకు వచ్చిన వ్యూస్‌ మేరకు అధికారులు ప్రకటన ఖర్చును లెక్కిస్తున్నారు. యూట్యూబ్‌లో వచ్చిన ప్రకటనకు ఒక వ్యూకు 30 పైసల చొప్పున ధర నిర్ణయించారు. 

వెబ్‌సైట్‌లలో
ప్రకటనకు సంబంధించి లైక్‌ (ఇంప్రెషన్స్‌)ల ఆధారంగా అభ్యర్థుల ఖర్చును లెక్కిస్తున్నారు. 300/350 పిక్సెల్‌ సైజు డిస్‌ప్లే బ్యానర్‌ ప్రకటనకు 1 సీపీటీఐ (కాస్ట్‌ పర్‌ థౌజెండ్‌ ఇంప్రెషన్స్‌) రూ.35 చొప్పున లెక్కిస్తున్నారు. సంబంధిత వెబ్‌సైట్‌కు ఉన్న యూజర్స్‌ మేరకు ఈ రేటు హెచ్చుతగ్గులుంటాయని అధికారులు చెప్పారు. 

20 లక్షలకు మించి యూజర్లు ఉన్న వెబ్‌సైట్‌ హోం పేజీలో ఇచ్చే వీడియో ప్రకటనకు రూ.75 వేలుగా నిర్ణయించారు.  ఫొటో ప్రకటనకు రూ.25 వేలుగా లెక్కిస్తున్నారు. ప్రైం టైమ్, నార్మల్‌ టైమ్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ రేట్లలో హెచ్చుతగ్గులుంటాయి. 

బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ 
తమ గుర్తుకు ఓటేయాలని పంపే బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లకూ ఎన్నికల సంఘం ఓ రేటును నిర్ణయించింది. ఇంగ్లి‹Ùలో 160 క్యారెక్టర్లు, స్థానిక భాషల్లో 70 క్యారెక్టర్లున్న ఒక్క ఎస్‌ఎంఎస్‌కు రూ.2.80 చొప్పున రికార్డు చేస్తున్నారు. 

సినిమా థియేటర్లలో ఇచ్చే ప్రకటనలకు 
500 సీటింగ్‌ కెపాసిటీకి మించి ఉన్న థియేటర్‌లో ఇచ్చే ప్రకటనలకు ప్రతి  10 సెకన్లకు రూ.15.30 చొప్పున,  500లోపు సీటింగ్‌ సామర్థ్యం ఉన్న  థియేటర్లలో రూ.13.26 చొప్పున  లెక్కిస్తున్నారు.

సోషల్‌ మీడియా ఖాతాల వివరాలివ్వాలి 
ఎన్నికల సంఘం డిజిటల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు జిల్లాల్లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. సంబంధిత అధికారులు డిజిటల్‌ మీడియాలో అభ్యర్థులు ఇస్తున్న ప్రకటనలను పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల సోషల్‌ మీడియా ఖాతాల వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కొత్తగా అభ్యర్థుల సోషల్‌ మీడియా ఖాతాల వివరాలు ఇవ్వడం తప్పనిసరి చేయడం గమనార్హం. 

-పి.బాలప్రసాద్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top