సాక్షి, చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. ఈ బిల్లు తమిళనాడు ఉనికినే దెబ్బతీసేలా ఉందని అన్నారు. డీలిమిటేషన్‌పై మొదటి నుంచి ఆయన కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ బిల్లు పాస్ అయితే గనుక న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అంటున్నారాయన.
‘‘లోక్‌సభ సాక్షిగా మోదీ, అమిత్ షా ఇచ్చిన హామీలను నమ్మలేం. నోటి మాటతో కాదు.. చట్ట సభల్లో రక్షణ కల్పించాలి. చట్ట సవరణ పేరుతో కొత్త కుట్రలు.. రాష్ట్రాల హక్కులు కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే కమిషన్‌కు అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. ఇది రాజకీయ వ్యూహమే తప్ప.. దేశ ప్రయోజనం కోసం ఎంతమాత్రం కాదు.
..తమకు కావాల్సిన రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడమే వాళ్ల ఉద్దేశం. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నంలో భాగంగా జాగ్రత్తగా వేసిన ఓ ఉచ్చు. జనాభా నియంత్రణ పాటించే ఇక్కడి రాష్ట్రాలకు శిక్షలా ఉంది. మెజారిటీ ఉందని ఏది పడితే అది చేయడం సరికాదు. ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదు’’ అని స్టాలిన్ ఉద్ఘాటించారు.
డీలిమిటేషన్‌ను మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో చేస్తున్నారని కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదిస్తున్నారు. అయితే.. కేంద్రం మాత్రం ఎలాంటి అన్యాయం జరగదని.. తమది భరోసా అని చెబుతోంది. పైగా డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 125 నుంచి 195కి చేరతాయి అని బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రాజ్యాంగ సవరణతో కూడిన ఈ బిల్లు పాస్ కావాలంటే సభలో 2/3 మెజారిటీ అవసరం. అంటే.. 360కి అవసరంకాగా ఎన్డీయే బలం 294నే ఉంది. ఇంకో 66 సీట్లు అవసరం. దీంతో మోదీ సర్కార్ ఎలా గట్టెక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


