దీక్షలు కాదు.. ఏపీ హామీలపై మోదీని ప్రశ్నించండి 

CPI Leader Ramakrishna Comments On Somu Veerraju - Sakshi

సోము వీర్రాజుకు సీపీఐ రామకృష్ణ హితవు  

ఒంగోలు: పార్లమెంట్‌ సాక్షిగా ఏపీ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీని ఎందుకు అడగట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని పంజాబ్‌లో ఫ్లైఓవర్‌పై నిలిపివేశారని.. ఏలూరులో సోము వీర్రాజు దీక్షకు దిగడం హాస్యాస్పదమన్నారు.

20 నిమిషాల పాటు మోదీ రోడ్డుపై ఆగితే ఇంత యాగీ చేస్తున్న బీజేపీ నాయకులు.. ప్రజా సమస్యలపై ఎందుకు వెంటనే స్పందించట్లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులపై కనీసం ఒక్క వినతిపత్రమైనా ప్రధానికి ఇచ్చారా అని నిలదీశారు. రాష్ట్రంలో పొత్తులపై తమ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని తెలిపారు. కాగా, ఉద్యోగులను పీఆర్సీ నిరుత్సాహపరిచిందని రామకృష్ణ పేర్కొన్నారు. ఈనెల 11న విజయవాడలో నిరుద్యోగులు, విద్యార్థులతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో నాయకులు పీజే చంద్రశేఖర్, ఎంఎల్‌ నారాయణ పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top