
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలాన్ని వాడటం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు ఎంతవరకూ కరెక్ట్ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈటెల మాట్లాడిన మాటలు ఎంపీ స్థాయి మాటల్లా లేవని, గంజాయి తాగిన వ్యక్తి మాటల్లా ఉన్నాయంటూ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ పై ఈటెల చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టిన జగ్గారెడ్డి.. ‘ నేను తిట్టడం కోసం ప్రెస్ మీట్ పెట్టా. మీకేనా తిట్టడం వచ్చింది.. మాకు రాదా?, మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకోవాలి’ అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
ఈటెల ఏరోజైనా సీఎంను కలిసి తన పార్లమెంట్ సమస్యల గురించి అడిగారా? అని జగ్గారెడ్డి నిలదీశారు. ఏదో ఫ్రస్టేషన్ లో ఈటెల మాట్లాడుతున్నట్లు ఉందని, సీఎంను తనకు పోస్ట్ వస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఉందన్నారు.ఈటెల పరిధి దాటి మాట్లాడాడు కాబట్టే తాను కూడా మాట్లాడుతున్నానన్నారు జగ్గారెడ్డి. ఆయన పెద్ద తోపేంద కాదని, పెద్ద పర్సనాలిటీ అని ఈటెల తనకు తానే ఊహించుకుంటున్నారని విమర్శించారు. గౌరవ ప్రదమైన విమర్శలు చేస్తే తప్పులేదు కానీ, ఈ తరహా వ్యాఖ్యలు సీఎంపై చేస్తారా అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి తెచ్చే తెలివి లేదు కానీ ఉద్దెర విమర్శలు ఎందుకన్నారు జగ్గారెడ్డి.
సీఎం ఓ తుగ్లక్. నువ్వో శాడిస్ట్
కాంగ్రెస్ ప్రభుత్వం తలాతోకా లేకుండా వ్యవహరిస్తోందని, ఇదిలాగే ఉంటే ఇంకా ఎన్నో రోజులు కొనసాగదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేం దర్ హెచ్చరించారు. 'ఇది తుగ్లక్ ప్రభుత్వం, సీఎం ఓ తుగ్లక్. నువ్వో శాడిస్ట్, సైకోవి కాబట్టి ప్రజలను ఏడిపి స్తున్నావు. మిస్టర్ ముఖ్యమంత్రి నీ కింద ఏం జరుగుతుందో సోయిపెట్టు. నీ కింది అధికారులు ఏం చేస్తున్నారో దృష్టి పెట్టు. ప్రజల జోలికి వస్తే ఖబడ్డార్' అని హెచ్చరించారు. శనివారం ఈటల మీడియాతో మాట్లాడుతూ తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అపార్ట్మెంట్లు కూలగొడతామంటూ హైడ్రా నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 'సీఎంకు, ఎమ్మెల్యేకు, మంత్రికి ఇక్కడికి వచ్చే ముఖం లేదు. దమ్ముంటే రమ్మని చెప్పండి. మేము హైడ్రాకు, చెరువుల పునరు ద్ధరణకు, మూసీలో కొబ్బరినీళ్ల వంటి నీళ్లను పారించడానికి వ్యతిరేకం కాదు. అన్ని అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చడానికి వ్యతిరేకం'అని స్పష్టంచేశారు.