మంత్రి పదవే వదులుకున్నా.. ప్రొటోకాల్‌పై కొట్లాడుతనా? 

Congress MLA Rajagopal Reddy Comments On Protocol Issue In Nalgonda - Sakshi

ప్రశ్నించినందుకే రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు

తెలంగాణ ప్రభుత్వంలో ఒక పద్ధతి అంటూ లేదు

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు

సాక్షి, ఆత్మకూరు(నల్లగొండ): తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవినే త్యాగం చేశా.. ప్రొటోకాల్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని.. దీనిపై కోట్లాడే మనస్తత్వం తనది కాదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆత్మకూర్‌(ఎం)లో విలేకరులతో మాట్లాడారు. వాసాలమర్రిలో ముఖ్యమంత్రి పాల్గొన్న సభా వేదికపైకి ఆహ్వానించలేదని.. అయినా గొడవకు దిగలేదని.. గ్రామం అభివృద్ధి చెందుతుందనే మిన్నకుండిపోయినట్లు వివరించారు. మునుగోడులో ప్రొటోకాల్‌పై ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారని.. తెలంగాణ ప్రభుత్వంలో ఒక పద్ధతి అంటూ లేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, పార్టీలు మారడం, అక్రమ వ్యాపారాలను కాపాడుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీ మారిన దాఖలాలు లేవని, అక్రమ వ్యాపారాలు చేస్తున్న చరిత్ర లేదని చెప్పారు. మూడు దశాబ్దాలుగా నల్లగొండలో అద్దె ఇంట్లోనే ఉంటున్నానని గుర్తు చేశారు.  2014లో మంత్రి జగదీశ్‌రెడ్డికి స్కూటర్‌ కూడా లేదని, అటువంటి వ్యక్తి నాగారంలో ప్రగతి భవన్‌ను మించిన భవనాన్ని నిర్మించుకున్నాడని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీలు సమస్యలపై స్పందించక పోవడంతో రాష్ట్రానికి ఎటువంటి నిధులు విడుదల కావడం లేదని తెలిపారు.

భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని సమస్యలు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బీబీనగర్‌లోని ఏయిమ్స్‌కు రూ. 796 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బీర్ల అయిలయ్య, ఎంపీపీ తండ మంగమ్మశ్రీశైలం, జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్‌ గుప్తా, సర్పంచ్‌ జెన్నాయికోడె నగేష్‌ ఉన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top