ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌దే.. | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌దే..

Published Wed, Nov 8 2023 5:09 AM

Congress Leader Revanth Reddy On BRS about Free electricity - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రైతులు బాగు పడాలని ఉచిత కరెంట్‌ ఆలోచన చేసినదే కాంగ్రెస్‌ పార్టీ అని, అసలు ఉచిత విద్యుత్‌ గురించి చెప్పుకొనే పేటెంట్‌ హక్కు తమ పార్టీకే ఉందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 2004లో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పైనే తొలి సంతకం చేశారని, రూ.1,200 కోట్ల విద్యుత్‌ బకాయిల ను రద్దు చేసి, రైతులపై ఉన్న అక్రమ కేసులను సైతం తొలగించారని గుర్తు చేశారు.

అలాంటి కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్, ఆ పార్టీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను రైతులకు 24 గంటల కరెంట్‌ వద్దు.. 3, 5 గంటలు చాలని అన్నట్టు దుష్ప్రచారం చేస్తు న్నారని.. తాను అలా ఎక్కడ అన్నానో నిరూ పించాలని సవాల్‌ విసిరారు.ఉమ్మడి పాల మూ రు జిల్లాలోని అలంపూర్, గద్వాల, మక్తల్‌ నియోజకవర్గాల పరిధిలో మంగళవారం నిర్వ హించిన ప్రజాగర్జన సభల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అలంపూర్‌ సాక్షిగా చెబుతున్నా.. ఏదైనా ఒక సబ్‌స్టేషన్‌కు వెళ్లి పరిశీలిద్దాం.

రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తే నా నామినేషన్‌ వాపస్‌ తీసుకుంటా. లేకుంటే ఇదే నడిగడ్డ మీద సీఎం కేసీఆర్‌ ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పాలి. వస్తావా? లేక తీసేసిన అబ్రహమో, కొత్త అభ్యర్థి పేరు తెల్వదు గానీ దొరగారి గడీల బానిస వస్తాడా.. లేక కేటీ ఆర్‌ను పంపిస్తావా? కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది.

మిత్రుడు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, సీఎం సిద్ధరామయ్యతో నేను, అలంపూర్‌ సంపత్‌కుమార్‌ కూర్చొని మాట్లాడి తుమ్మిళ్ల ప్రాజెక్టు సమస్యను పరిష్కరిస్తాం. కృష్ణా పుష్కరాల సందర్భంగా రూ.100 కోట్లతో జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్‌ హామీ ఏమైంది?

ముదిరాజ్‌లు అక్కర్లేదా?
తెలంగాణలో 11 శాతం ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్‌ఎస్‌ ఒక్క టికెట్‌ ఇవ్వలేదు. ఇవాళ ముదిరాజ్‌ల ఓట్లు అక్కర్లేకుండా పోయాయా? కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. హేమాహేమీలు పోటీపడ్డా ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించేందుకే వారికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇచ్చింది. మక్తల్‌లో వాకిటి శ్రీహరి, రాజేంద్రనగర్‌లో నరేందర్, గోషామహల్‌లో సునీతారావు, పటాన్‌చెరులో నీలం మధుకు టికెట్‌ ఇచ్చాం.

ధరణి కంటే మెరుగైన విధానం తెస్తాం
సీఎం కేసీఆర్‌ కుటుంబం ధరణిని దోపిడీకి వాడుకుంటోంది. ధరణి వారికి ఏటీఎంగా మారింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ధరణి కంటే నాణ్యమైన విధానాన్ని తీసుకొకొచ్చి భూములను కాపాడుతాం. ఎక్కడైతే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో అక్కడ బీఆర్‌ఎస్‌ ఓట్లు అడగాలి. ఎక్కడైతే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో అక్కడ కాంగ్రెస్‌ ఓట్లు అడుగుతుంది.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇచ్చే బాధ్యతను తీసుకుంటుంది. ధరణి రద్దు చేస్తే రైతుబంధు పోతుందని అబద్ధాలు మాట్లాతున్నారు. ధరణి లాంటిది లేకుండానే వైఎస్‌ హయాంలో రైతులకు రుణమాఫీ, బీమా సౌకర్యం, ఎరువుల సబ్సిడీ ఇవ్వలేదా?

లక్ష కోట్ల దోపిడీ జరిగింది
ఎవరో పనిమంతుడు పందిరేస్తే.. కుక్కతోక తగలగానే కూలిపోయిందట. కాళేశ్వరం పరిస్థితి అట్లా ఉంది. మేడిగడ్డ కడితే భూమిలోకి కుంగిపోయింది. అన్నారం కడితే ఫక్కున పగిలిపోయింది. సుందిళ్ల రేపోమాపో కూలేటట్టు ఉంది. ఇక మీ పాపం పండిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరిట రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పటికే తప్పుడు వాగ్దానాలతో కేసీఆర్‌ రెండు సార్లు సీఎం అయ్యారు.

పది వేల ఎకరాల భూములను అక్రమంగా సంపాదించుకున్నారు. ఆయన ఇంట్లో అల్లుడు, బిడ్డ, కొడుక్కు పదవులు ఇచ్చారు. మూడోసారి గెలిస్తే మనవడికి కూడా పదవి ఇచ్చేలా ఉన్నారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసే కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తే కృష్ణా నదిలో ముంచేస్తారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా.. ప్రజలు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలి..’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు సంపత్‌కుమార్, సరిత తిరుపతయ్య, వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement