
బీఆర్‌ఎస్ కీలక నేతలకు కాంగ్రెస్, బీజేపీ గాలం
పార్టీల్లో చేర్చుకుని లోక్‌సభ అభ్యర్థులుగా అవకాశం
ఇప్పటిదాకా బీజేపీ ప్రకటించిన సీట్లలో మూడో వంతు బీఆర్‌ఎస్ నుంచి వచ్చినవారికే..
కీలక స్థానాల్లో పోటీకి బీఆర్‌ఎస్ నేతలవైపు కాంగ్రెస్ చూపు
పోటీలో దింపకున్నా మరికొందరిని చేర్చుకునేందుకు జాతీయ పార్టీల యత్నాలు
పార్టీ బలోపేతమైనట్టుగా చూపుకొనేందుకు ప్రయత్నాలు
సీనియారిటీ, ఆర్థికబలం, స్థానికతకు బీఆర్‌ఎస్ మొగ్గు
నష్టాన్ని పూడ్చుకుంటూనే దీటుగా నిలబడేందుకు కేసీఆర్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘వల’స రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక బీఆర్‌ఎస్ నేతలే టార్గెట్‌గా సాగినట్టు కనిపిస్తోంది. బీజేపీ ఎంపిక చేసిన వారిలో ఎక్కువ మంది బీఆర్‌ఎస్ నుంచి వచ్చినవారే ఉండటం, అధికార కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తున్న సూచనలు ఉండటం దీనిని బలపరుస్తోంది. రెండు జాతీయ పార్టీలు కూడా ఇలా వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం బీఆర్‌ఎస్ శిబిరంలో కలవరం రేపుతోంది.
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటివరకు బీజేపీ 15, కాంగ్రెస్ 4, బీఆర్‌ఎస్ 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. బీజేపీ ప్రకటించిన 15 మందిలో ఐదుగురు ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి వచ్చి చేరినవారే. కాంగ్రెస్ మలి జాబితాలో బీఆర్‌ఎస్ నుంచి చేరిన ముగ్గురు లేదా నలుగురికి టికెట్లు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్ ఈ నష్టాన్ని పూడ్చుకోవడంపై దృష్టి సారిస్తూనే దీటైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అదే సమయంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు చర్చలు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో.. ప్రధాన పార్టీలన్నీ మిగతా అభ్యర్థుల ఎంపికను వేగిరం చేశాయి. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వలసల రాజకీయం మరింత ఊపందుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీఆర్‌ఎస్ అసంతృప్తులపై కాంగ్రెస్ ఫోకస్..
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే బీఆర్‌ఎస్ నేతలను చేర్చుకోవడంపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. పెద్దపల్లి లోక్‌సభ టికెట్‌ను ఆశిస్తూ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ ఆశించిన గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతె శోభన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు.
చేవెళ్ల టికెట్‌ను ఆశిస్తూ మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి దంపతులు హస్తం గూటికి చేరారు. ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్న మహేందర్‌రెడ్డి భార్య సునీతకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఓ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి రప్పించి భువనగిరి టికెట్ ఇవ్వనున్నట్టు తెలిసింది.
బీఆర్‌ఎస్ నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి ఇటీవల సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో భేటీకావడం గమనార్హం. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ప్రకటించినా.. బెంగళూరు వేదికగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి భేటీపై చర్చ జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే నాటికి మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కేవలం బీఆర్‌ఎస్ నుంచే కాకుండా బీజేపీ అసంతృప్తులపైనా కాంగ్రెస్ దృష్టి సారించింది. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో సీఎం రేవంత్ భేటీ కావడమే దీనికి సంకేతమని అంటున్నారు.
కమలం గూటికి తాజా, మాజీ గులాబీలు
ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలు జరుగుతున్న సమయంలో.. గత నెల మొదటి వారంలోనే బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు పి.రాములు (నాగర్‌కర్నూల్) బీబీ పాటిల్ (జహీరాబాద్) కాషాయదళంలో చేరారు. రాములు కుమారుడు భరత్‌కు, బీబీ పాటిల్‌కు వెంటనే బీజేపీ ఎంపీ టికెట్లు లభించాయి.
మాజీ ఎంపీలు గోడెం నగేశ్ (ఆదిలాబాద్), సీతారాంనాయక్ (మహబూబాబాద్)తో పాటు మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి (నల్గొండ)కు పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే బీజేపీ అభ్యర్థిత్వం దక్కింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను పార్టీలో చేర్చుకుని వరంగల్ టికెట్ ఇచ్చే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే లోకసభ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారే బీజేపీలో చేరుతుండగా.. అసెంబ్లీ, ఆ దిగువస్థాయి నుంచి బీజేపీలోకి పెద్దగా చేరికలు కనిపించడం లేదు.
ప్రధాని మోదీ చరిష్మా, రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షం బీఆర్‌ఎస్‌లపై ఉన్న వ్యతిరేకతకుతోడు ప్రధాని మోదీ చరిష్మా, రామ మందిర నిర్మాణం వంటి అంశాలు తమకు లాభిస్తుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వరుస పర్యటనలు ఉన్న నేపథ్యంలో కింది స్థాయిలోనూ ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
అభ్యర్థుల ఎంపిక.. బీఎస్పీతో పొత్తులు
రెండు జాతీయ పార్టీలు ‘వల’సలతో ఇబ్బందిపెడుతున్నా.. దీటుగా ఎదుర్కొనేలా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తూనే.. బీఎస్పీతో పొత్తు అంశాన్ని వ్యూహాత్మకంగా తెరమీదికి తీసుకువచ్చారు. బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతమున్న 9 మంది సిట్టింగ్ ఎంపీల్లో ఇప్పటికే ముగ్గురు పార్టీని వీడగా.. మరో ఇద్దరు రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), పసునూరు దయాకర్ (వరంగల్) పోటీకి దూరంగా ఉన్నారు.
కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్) ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎంపీ పోటీకి దూరమయ్యారు. దీనితో సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు మన్నె శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్), మాలోత్ కవిత (మహబూబాబాద్), నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం) మాత్రమే తిరిగి బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉండి, పలుకుబడి ఉన్న ఎంపీలు, ఇతర కీలకనేతలను కాంగ్రెస్, బీజేపీ చేర్చుకుంటుండటంతో.. ఆయా స్థానాల్లో ప్రత్యామ్నాయంపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది.
ఆర్ధిక స్థోమత కలిగి, పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలను, సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న వారిని పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. సీనియారిటీ ఆధారంగా కడియం శ్రీహరి (ఆయన కుమార్తె కావ్యకు వరంగల్), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి), బోయినపల్లి వినోద్‌కుమార్ (కరీంనగర్), ఆత్రం సక్కు (ఆదిలాబాద్)లకు టికెట్లు ఇచ్చారు.
ఆర్ధిక బలం, స్థానికత తదితరాల ప్రాతిపదికగా కాసాని జ్ఞానేశ్వర్ (చేవెళ్ల), గాలి అనిల్‌కుమార్ (జహీరాబాద్), రాగిడి లక్ష్మారెడ్డి (మల్కాజిగిరి)ని ఎంపిక చేశారు. ఇక పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్‌కర్నూల్ స్థానం కేటాయించేందుకు బీఆర్‌ఎస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక పార్టీ నుంచి కొనసాగుతున్న వలసతో జరిగే నష్టాన్ని పూడ్చుకోవడంపైనా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత, త్రిముఖ పోటీ కలసి వస్తుందని పేర్కొంటున్నారు.