ఆ రెండు పార్టీల్లో అగ్గి రాజేస్తున్న సీట్ల పంపకం | The conflict between TDP-Janase Cadre | Sakshi
Sakshi News home page

ఆ రెండు పార్టీల్లో అగ్గి రాజేస్తున్న సీట్ల పంపకం

Mar 3 2024 9:12 PM | Updated on Mar 3 2024 9:25 PM

The conflict between TDP-Janase Cadre - Sakshi

టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకం రెండు పార్టీల్లోనూ చిచ్చు రాజేసింది. సీట్లు కోరుకుంటున్న ఆశావహుల మధ్య ఈ వివాదాలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. కొన్ని చోట్ల అంతర్గతంగా నిప్పు రగులుతోంది. మరికొన్ని చోట్ల రోడ్ల మీదే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలా రెండు పార్టీల్లోనూ చెలరేగుతున్న అసమ్మతిని చల్లార్చలేక దత్తతండ్రి, దత్త పుత్రుడు చేతులెత్తేశారని టాక్ నడుస్తోంది. టీడీపీ, జనసేన గొడవలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూద్దాం.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచి రెండు పార్టీల్లోనూ అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఈ విభేదాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకు వెళ్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం సీటును మహాసేన రాజేష్ కు ఇవ్వడంపై జనసేన నాయకులు భగ్గుమన్నారు. అంబాజీపేటలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ గందరగోళంగా మారింది. రాజేష్ గో బ్యాక్.. టీడీపీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ నేత హరీష్ మాధుర్ కారును జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని జనసేన నాయకులే కాదు టీడీపీ నాయకులు కూడా అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. మహాసేన రాజేష్ అనే వ్యక్తి బ్లాక్ మెయిలర్‌ అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో టీడీపీ నాయకులను తప్పుడు పోస్టింగులతో వేధించి..బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

గతంలో మహసేన రాజేష్ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలను, నాయకులను, పవన్ కళ్యాణ్, చిరంజీవిని ఆయన కుటుంబ సభ్యులను దూషించిన వీడియోలు ప్రదర్శిస్తున్నారు. రాజమండ్రి రూరల్ స్థానాన్ని చంద్రబాబు రిజర్వ్ చేయడంపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ సీటును మొదట జనసేనకు కేటాయిస్తామనడంతో.. కందుల దుర్గేశ్ పోటీ చేస్తారని జనసేన నాయకులు భావించారు. కానీ ఇప్పుడు ఆ సీటు బుచ్చయ్య చౌదరికే ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. కందుల దుర్గేష్‌ను నిడదవోలు నుంచి పోటీ చేయిస్తారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్‌కే సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరిని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.

కొత్తపేట నియోజకవర్గంలోనూ ఓ కుటుంబంలో ఈ సీట్లు ప్రకటన విభేదాలను సృష్టించింది. తెలుగుదేశం పార్టీ తరఫున బండారు సత్యానందరావుకు సీటు ప్రకటించారు. జనసేన తరపున ఆయన సోదరుడు బండారు శ్రీనివాసరావు సీటు ఆశించారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చివరికి బండారు శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపించారు. దీంతో శ్రీనివాసరావు వర్గీయులు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేసిన ముష్టి 24 సీట్లకు కక్కుర్తి పడే బదులు 60 లేదా 70 సీట్లు తీసుకుంటే పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరిగేది అంటున్నారు.

సీట్ల కేటాయింపు టీడీపీ నేతల మధ్య కూడా అగ్గి రాజేస్తోంది. నిడదవోలులో బూరుగుపల్లి శేషారావుని కాదని జనసేన నేత కందుల దుర్గేష్ ను పోటీ చేయిస్తారనే ప్రచారంపై బూరుగుపల్లి అనుచరులు మండిపడుతున్నారు. నాలుగు మండలాల కార్యకర్తలు సమావేశమై శేషారావుకు సీటు ఇవ్వని పక్షంలో తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. బుచ్చయ్య చౌదరి కోసం శేషారావు రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉండి టీడీపీలోనూ అసమ్మతి జ్వాలలు ఇప్పటికీ చల్లారలేదు. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కలిసేందుకు టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు వెళ్ళగా ఆయనకు చేదు అనుభవం ఎదురయింది. రామరాజును కలిసేందుకు శివరామరాజు నిరాకరించారు. పార్టీలో తనను అడుగడుగునా అవమాన పరుస్తున్నారని శివరామరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామరాజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ప్రకటించే ప్రసక్తే లేదన్నారు. తనకు తెలుగుదేశం పార్టీతో అనుబంధం తీరిపోయిందని ప్రకటించిన శివరామరాజు పసుపు రంగు చొక్కాను సముద్రంలో వదిలేశారు.. 

మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలోని ఇదే పరిస్థితి నెలకొంది.. మాడుగుల నుంచి మాజీ ఎమ్మెల్యే రామానాయుడు కుమార్ పైలా ప్రసాద్ సీటు ఆశిస్తున్నారు. రామానాయుడుకు సీటు కేటాయించాలంటూ ఆయన వర్గీయులు రోడ్డు ఎక్కారు. రామానాయుడుకు మద్దతుగా సమావేశమయ్యారు. రామానాయుడుకు సీటు ఇవ్వకపోతే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. టీడీపీ జనసేన పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలు.. రెండు పార్టీల్లోనూ అంతర్గతంగా జరుగుతున్న గొడవలతో అంతా గందరగోళంగా తయారవుతోంది. ఇన్ని గొడవలు జరుగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం వారికి మింగుడు పడడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement