(హైదరాబాద్) గచ్చిబౌలి:‘‘పెళ్లి ఏర్పాట్లకు డబ్బు కోసం శక్తికి మించి ప్రయత్నించా. ఇంకో మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది’’ అని ఆత్మహత్యకు పాల్పడిన మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ‘‘23 మంది నుంచి తాను తీసుకున్న రూ.7.72 కోట్ల అప్పుల వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులు, కాబోయే భార్యకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.గచ్చిబౌలి పోలీసులు సూసైడ్ నోట్‌లోని వివరాల వెల్లడించారు. పెట్టుబడుల పేరిట చేసిన అప్పులను నా సోదరుడు మెట్ల సాయి పవన్‌కళ్యాణ్ తీర్చాలి. అయనకు పెట్టుబడి కోసం కొంత ఇచ్చాను కాబట్టి నన్ను మోసగాడిగా, అబద్ధాల కోరుగా మిగల్చకుండా అప్పులు తీర్చాలి.
నేను ఎంతగానో ప్రేమించిన పెల్సియాకు అబద్దాలు చెప్పాను. క్యాన్సర్ వచ్చిందని తెలిసినా పెల్సియా నా వైపు నిలబడింది. వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టినా రిటర్న్స్ ఆలస్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్ర రూపం దాల్చాయి. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయకపోయినా ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్‌లో తిరిగి ఇవ్వాల్సి ఉంది. అన్ని విధాల ప్రయత్నించినా విఫలమయ్యాను. నాకు క్యాన్సర్ వచ్చింది అబద్ధం కాదు, ఢిల్లీలో చికిత్స తీసుకుంటే నయమైంది. 2023లో మళ్లీ క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో పెల్సియా(కాబోయే భార్య) నా వైపు నిలబడింది. ఆమె కారణంగా మూడు సంవత్సరాలు బతికాను. రెండు నెలలుగా పెళ్లిని నిలిపివేయడానికి ప్రయతి్నస్తున్నాను.
డబ్బు ఇవ్వాల్సిన గడువు దగ్గర పడటం, పెళ్లికి ఖర్చులకు డబ్బు లేక పోవడంతో ఒత్తిడి భరించలేక నిర్ణయం తీసుకున్నాను. అందరూ నన్ను క్షమించండి’’ అని డెత్ స్టేట్ మెంట్‌లో పేర్కొన్నారు. ఆ మేసేజ్‌ను గచ్చిబౌలి పోలీసులు డెత్ స్టేట్‌మెంట్‌గా పరిగణిస్తున్నారు. మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యులకు మృతదేహన్ని అప్పగించారు. అంత్యక్రియల కోసం స్వస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి తరలించారు.


