సాక్షి, విజయవాడ: ఏపీవ్యాప్తంగా ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి, మైలవరం నియోజకవర్గ పరిశీలకురాలు బండి పుణ్యశీల, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలి: వెల్లంపల్లి
మహిళలను కించపరిచేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఏబీఎన్ వద్ద ఆందోళనకు వెళితే కిలోమీటర్ దూరంలో ఆపేశారు. గతంలో సాక్షి కార్యాలయంపై దాడి చేసి తగలబెడితే పోలీసులు కనీసం అడ్డుకోలేదు. ఏబీఎన్ తప్పుచేసినా వందలాది మంది కాపలాకాశారు. సాక్షికి ఒక న్యాయం? ఆంధ్రజ్యోతికి ఒక న్యాయమా?. వైఎస్సార్‌సీపీ నేతల భార్యల గురించి మాట్లాడితే కూటమి నేతలు సమర్థిస్తున్నారు. ఇంతమంది మహిళలకు అన్యాయం జరిగితే కనీసం స్పందించరా?
మాచవరం పోలీస్ స్టేషన్‌కి ర్యాలీగా వైఎస్సార్‌సీపీ నేతలు..
మాచవరం పోలీస్ స్టేషన్‌కి ర్యాలీగా వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.. ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల నీచమైన రాతలు రాసిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాచవరం పోలీసులకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా: ఏబీఎన్ రాధాకృష్ణ.. వైఎస్సార్‌సీపీ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాసిన తప్పుడు రాతలను వెనక్కి తీసుకోవాలని.. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఉండి పోలీస్ స్టేషన్‌లో ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పార్టీ ఇంచార్జ్ పివిఎల్ నరసింహారాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
కాకినాడ జిల్లా: ఏబీఎన్ రాధాకృష్ణపై తుని టౌన్ పీఎస్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఫిర్యాదు చేశారు. ఎస్. అన్నవరం నుండి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు బైక్ ర్యాలీతో నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ఏబీఎన్ రాధాకృష్ణ వికృత మనస్తత్వం బయట పడిందని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. రాజధాని కోసం వైఎస్ జగన్ సూచించిన మావిగాన్‌ను డైవర్ట్ చేయడం కోసమే ఏబీఎన్ రాధాకృష్ణ.. వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారని రాజా ధ్వజమెత్తారు.
వైఎస్సార్ జిల్లా: ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి డిమాండ్ చేశారు. కమలాపురం పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై ఆయన ఫిర్యాదు చేశారు. నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ.. మావిగన్ అనేది రాష్ట్రానికి ఓ ఆర్థిక వనరు. అమరావతి రాష్ట్రానికి ఓ గుదిబండ. చంద్రబాబు అసమర్థత వల్లే మావిగన్‌ను వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారని రామాంజులరెడ్డి వివరించారు.


