పార్వతీపురం మన్యం: ఉపాధిహామీ వేతనదారుల మస్తర్ నమోదుకు యాప్‌లో ఫేస్ రీడింగ్ కీలకం. ఇందులో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులు వేతనదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పలుసార్లు మేట్‌లు యాప్‌లో ఫేస్ రీడింగ్ చేస్తున్నా నమోదుకావడంలేదు. దీంతో పనిచేసినా వేతనాలు వస్తాయోలేదోనన్న బెంగ వెంటాడుతోంది. దీనిని అధిగమించేందుకు అక్కన్నగూడకు చెందిన వేతనదారు సవర సుంబురుకు వినూత్నమైన ఆలోచన వచ్చింది.
సోమవారం నుంచి ఉపాధిహామీ పనికి వెళ్తున్న ఆయన ఫేస్ నమోదు కాకపోవడంతో బుధవారం ముఖానికి ఒత్తుగా పౌడర్ అద్దుకుని వెళ్లాడు. మేట్ ముఖఆధారిత యాప్‌లో ఫేస్‌ను రీడింగ్ చేయగానే అప్‌లోడ్ అయింది. దీంతో వేతనదారులంతా అవాక్కయ్యారు. పౌడరు రాసుకుని వస్తే మీ ముఖం కూడా నమోదవుతుందంటూ ఆయన ఉచిత సలహా ఇచ్చాడు. భలేభలే అంటూ వేతనదారులందరూ నవ్వుకున్నారు.


