నాగుపామును చూసి పారిపోలేదు… దగ్గరకి వెళ్లి నీళ్లు పోశాడు! | young man saves snake from heat visakhapatnam | Sakshi
Sakshi News home page

నాగుపామును చూసి పారిపోలేదు… దగ్గరకి వెళ్లి నీళ్లు పోశాడు!

Apr 9 2026 10:40 AM | Updated on Apr 9 2026 12:41 PM

young man saves snake from heat visakhapatnam

విశాఖపట్నం జిల్లా: భానుడి భగభగలకు మనుషులే కాదు, మూగజీవాలు సైతం అల్లాడిపోతున్నాయి. కనీసం అడుగు బయటపెట్టలేని మండుటెండలో ఓ నాగుపాము తారు రోడ్డుపై వేడికి తాళలేక విలవిల్లాడింది. ఈ దృశ్యాన్ని చూసిన ఓ యువకుడు ధైర్యం చేసి దానిపై నీరు పోసి సేదతీర్చాడు. ఈ ఆసక్తికర ఘటన మల్కాపురంలో బుధవారం చోటుచేసుకుంది. మల్కాపురం హెచ్‌పీసీఎల్‌ వెనుక గల ఏటీపీ సైట్‌కు వెళ్లే మార్గంలో బుధవారం మిట్టమధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంది.

 రోడ్డుపై నుంచి వేడి ఆవిర్లు వస్తున్న సమయంలో, పక్కనే ఉన్న తుప్పల నుంచి సుమారు నాలుగు అడుగుల పొడవున్న ఓ నాగుపాము తారు రోడ్డుపైకి వచ్చింది. ఆ వేడికి తట్టుకోలేక రోడ్డు మధ్యలోనే చిక్కుకుపోయి గిలగిల కొట్టుకుంటోంది. అదే సమయంలో ద్విచక్రవాహనంపై అటుగా వచ్చిన గణేష్‌ అనే యువకుడు సర్పం అవస్థను గమనించాడు. భయపడకుండా తన వెంట ఉన్న బాటిల్‌లోని చల్లటి నీటిని పాముపై ముందుగా కొద్దిగా చల్లాడు. దాని నుంచి ఎలాంటి ప్రతిఘటన రాకపోవడంతో, మరింత ఆత్మవిశ్వాసంతో పాము తలపై నీరు ధారగా పోశాడు.

 ఆశ్చర్యకరంగా ఆ సర్పం కూడా ఎలాంటి హాని చేయకుండా, ప్రశాంతంగా తల దించుకుని ఆ చల్లటి నీటితో కాసేపు సేదతీరింది. అనంతరం నెమ్మదిగా అక్కడి నుంచి పక్కనే ఉన్న తుప్పల్లోకి జారుకుంది. మండే వేసవిలో నీరు దొరకక పక్షులు, జంతువులు, సరీసృపాలు అల్లాడిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ మానవత్వంతో తమ ఇళ్ల ప్రాంగణాల్లో, మేడల పైన లేదా ఇంటి బయట చెట్ల కింద చిన్నపాటి మట్టి పాత్రల్లో నీటిని ఉంచాలని, తద్వారా మూగజీవాల ప్రాణాలు నిలబెట్టిన వారవుతారని పలువురు కోరుతున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement