దేశ చరిత్రలో పాదయాత్రలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో లక్ష్య సాధన కోసం యాత్రలు చేసేవారు. ఆ తర్వాత అవి ప్రజల కోసం, సమస్యల పరిష్కారం కోసం రాజకీయ మలుపు తీసుకున్నాయి. 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర, 2017లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చేసిన పాదయాత్ర.. ఈ రెండూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మహానేత, జననేత చేపట్టిన యాత్రలు ప్రజల జీవితాల్లో.. రాష్ట్ర అభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. వాటి ఫలితంగా వచ్చిన ఐదు ప్రధాన మార్పులను ఓసారి పరిశీలిద్దాం.
విద్యా రంగం
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. పేద పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రారంభమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కోసం సుమారు రూ.4,000–5,000 కోట్లు ఖర్చు చేశారు. పేద పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అనేక మంది డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు అయ్యేలా మార్గం సుగమం చేశారు.
వైఎస్ జగన్ హయాంలో.. నాడు–నేడు కార్యక్రమం ద్వారా సర్కారీ బడులను ఆధునికీకరించారు. అమ్మఒడి, జగనన్న వసతి తదితర పథకాల ద్వారా తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించి.. డ్రాపవుట్లను తగ్గించి పేద పిల్లల చదువును కొనసాగించేలా చేశారు. ఒక్క అమ్మ ఒడి పథకం కోసం సుమారు రూ. 35,000 కోట్లకు పైనే నిధులు ఖర్చు చేశారు. ఈ పాలనలోనే ఇంగ్లీష్ మీడియంతో పాటు అంతర్జాతీయ సిలబస్(IB)తో విద్యాభోదన ప్రయత్నాలు మొదలయ్యాయి. తద్వారా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి పేద విద్యార్థులను తీర్చిదిద్దాలని వైఎస్ జగన్ సంకల్పించారు.
ఆరోగ్య రంగం
వైఎస్సార్ హయాంలో.. ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు. రాష్ట్ర ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పు ఇది. ఒక అంచనా ప్రకారం.. 2007–2009 మధ్య కాలంలోనే వైఎస్ ప్రభుత్వం రూ.3,500–4,000 కోట్లు పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేసింది.
వైఎస్ జగన్ హయాంలో.. ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ క్లినిక్స్, ఫ్యామీలీ డాక్టర్ కాన్సెప్ట్‌లు ఏర్పాటు చేశారు. ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందేలా చేశారు. ఇందుకుగానూ సుమారు రూ.10 వేల కోట్లకు పైనే ఖర్చు చేశారు.
రైతన్న రాజ్యంలో..
వైఎస్సార్ హయాంలో.. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయాన్ని బలోపేతం చేశారు. రైతన్నకు రారాజును చేశారు. ఉచిత విద్యుత్ పథకంతో పా జలయజ్ఞం సాగునీటి ప్రాజెక్టులపై సుమారు రూ. 60,000 కోట్లు పైగా ఖర్చు చేశారు.
వైఎస్ జగన్ హయాంలో.. రైతు సంక్షేమం కోసం అదనంగా.. రైతు భరోసా కేంద్రాలు(RBK సెంటర్లు) ఏర్పాటు చేసి, విత్తనాలు, ఎరువులు, మార్కెట్ సమాచారం అందించారు. ఇందుకుగానూ.. సుమారు రూ.4 వేల కోట్ల దాకా ఖర్చు చేశారు. మునుపెన్నడూ లేని రీతిలో పంట బీమా, తక్షణ నష్టపరిహారం అందజేశారు. ఇక.. రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.7,500 కోట్ల చొప్పున ఆర్థిక సహాయం రూపంలో రైతులకు అందజేశారు.
ఇరిగేషన్
వైఎస్సార్ హయాంలో.. అనేక సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు. పోలవరం లాంటి మెగా ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. జలయజ్ఞం ద్వారా 8.2 మిలియన్ ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం దిశగా కృషి చేశారు.
వైఎస్ జగన్ హయాంలో.. నీటి వనరుల వినియోగాన్ని సమర్థవంతంగా చేయడానికి చర్యలు తీసుకున్నారు. పోలవరం పనులను కొనసాగిస్తూ, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. పోలవరం పనులు కొనసాగిస్తూ, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.15,000 నుంచి 20,000 కోట్ల దాకా కేటాయించారు.
పారిశ్రామిక రంగం
వైఎస్సార్ హయాంలో.. పారిశ్రామిక వృద్ధికి పునాది వేసి, పెట్టుబడులను ఆకర్షించారు. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు వేల కోట్లు ఖర్చు చేశారు. దానికి తగ్గ ప్రతిఫలం నేటికి కళ్ల ముందు కనిపిస్తోంది.
వైఎస్ జగన్ హయాంలో.. పారిశ్రామిక అభివృద్ధి కోసం వేల కోట్లు కేటాయించారు. భారీ ఎత్తున పెట్టుబడుల్ని, కంపెనీలను రాబట్టగలిగారు. YSR Jagananna Mega Industrial Hub వంటి ప్రాజెక్టులు ప్రారంభించి.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ ఇద్దరూ పాదయాత్రలు ప్రజలతో నేరుగా మమేకమై, వాళ్ల కష్టాలను దగ్గరగా చూశారు. ఆ పాదయాత్రల తర్వాతే ఇద్దరూ అధికారంలోకి వచ్చారు. తమ పాలనలో అన్నివర్గాల సమస్యలకు చక్కటి పరిష్కారం చూపగలిగారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, ఇరిగేషన్, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్ర రూపురేఖలను మార్చేశారు. జగన్ చెప్పినట్లు.. ఆయా రంగాల్లో వైఎస్సార్ వేసిన ముద్రను ఎవరూ చెరిపేయలేరేమో. కానీ, తండ్రి బాటలో పయనించి తన సంక్షేమ పాలనతో ఆ మార్క్‌ను వైఎస్ జగన్ అందుకోగలిగారనే చెప్పొచ్చు.
వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా..


