గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో పొరపాటున మర్చిపోయిన ఓ బ్యాగ్‌ను ఎయిర్‌పోర్టు క్రైమ్ పోలీసులు రప్పించి, యజమానికి అందజేశారు. ఎయిర్‌పోర్టు క్రైమ్ ఎస్‌ఐ రవి కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూరుకు చెందిన యూసఫ్ ఆలీ దంపతులు ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో విమానాశ్రయంలో తమ బ్యాగ్‌ను మర్చిపోయారు. విమానం ఎక్కిన తర్వాత బ్యాగ్ లేదన్న విషయాన్ని గమనించిన యూసఫ్ ఆలీ ఆందోళనకు గురయ్యారు. అప్పటికే విమానం తలుపులు పడటంతో, ఆయన వెంటనే తన సోదరుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన విమానాశ్రయానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీఐఎస్‌ఎఫ్, ఇమిగ్రేషన్ అధికారుల సహాయంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సెక్యూరిటీ చెక్ వద్ద యూసఫ్ ఆలీ బ్యాగ్‌ను మర్చిపోగా.. ముంబయి వెళ్తున్న కొందరు ప్రయాణికులు పొరపాటున ఆ బ్యాగ్‌ను తమ లగేజీగా భావించి తీసుకెళ్లిపోయినట్లు గుర్తించారు. ముంబయి చేరుకున్నాక అది తమ బ్యాగ్ కాదని గుర్తించిన ఆ ప్రయాణికులు, దానిని విమానంలోనే వదిలేసి వెళ్లారు. విమాన సిబ్బంది ఆ బ్యాగ్‌ను గమనించి అక్కడి చీఫ్ సెక్యూరిటీ అధికారులకు అప్పగించారు. ముంబయి పోలీసుల సమన్వయంతో ఆ బ్యాగ్ తిరిగి విశాఖకు చేరుకుంది. ఈ లోపు మంగళూరు చేరుకున్న యూసఫ్ ఆలీ, సమాచారం అందుకుని వెంటనే మరో విమానంలో విశాఖకు వచ్చారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ఆ బ్యాగ్‌ను ఆయనకు అందజేశారు. ఆ బ్యాగ్‌లో 85 గ్రాముల బంగారం, నూతన వస్త్రాలు ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. పోగొట్టుకున్న సొత్తును తిరిగి అప్పగించినందుకు యూసఫ్ ఆలీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


