మౌనిక హత్య కేసులో కొత్త మలుపు | - | Sakshi
Sakshi News home page

మౌనిక హత్య కేసులో కొత్త మలుపు

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

పోలీసులనే బురిడీ కొట్టించిన నిందితుడు స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లో హత్య చేసి బ్యాగ్‌లో మృతదేహం తరలింపు సీసీ టీవీ ఫుటేజీతో రవీంద్ర డ్రామాకు తెరదించిన పోలీసులు

గాజువాక : గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో కొత్తమలుపు చోటుచేసుకుంది. నిందితుడు చింతాడ రవీంద్ర పోలీసులనే తప్పుదోవ పట్టించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మౌనికను వేరే అపార్ట్‌మెంట్‌లో హత్య చేసి మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‌లో తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌కు తీసుకొచ్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాను నివాసముంటున్న కీర్తి ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లో మౌనికను హత్య చేసినట్టు పోలీసుల వద్ద నిందితుడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ రోజు రవీంద్ర ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు మౌనిక వచ్చినట్టు సీసీ కెమెరాలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. దీంతో అతడిని పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించగా, తాను మౌనికను హత్య చేసింది తన అపార్ట్‌మెంట్‌లో కాదని, అక్కడికి సమీపంలో ఉన్న మరో అపార్ట్‌మెంట్‌లోని తన స్నేహితుడి ఫ్లాట్‌లోనని చెప్పడంతో పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అక్కడికి మౌనిక వచ్చినట్టు, ఆమె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో తరలించినట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్‌ ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే?

నగరంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన మౌనికను నేవీ ఉద్యోగి చింతల రవీంద్ర గత నెల 29న పాతగాజువాకలోని ఎల్వీనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య అనంతరం అతడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన దాని ప్రకారం మౌనికను కీర్తి ఎన్‌క్లేవ్‌లోనే హత్య చేశాడని పోలీసులు సైతం అనుకున్నారు. దాని ప్రకారం అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం పలుమార్లు నిందితుడు నివాసముండే అపార్ట్‌మెంట్‌తోపాటు, తల, చేతులు కాల్చిన ధారపాలేనికి వెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. కీర్తి ఎన్‌క్లేవ్‌లో హత్య జరిగిన రోజుగాని, అంతకుముందు మూడు రోజులుగాని హతురాలు మౌనిక నిందితుడి ఇంటికి వచ్చినట్టు సీసీ కెమెరాలో నమోదు కాలేదు. ఇతర ఆధారాలు కూడా లభించలేదు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. దీంతో పోలీసులు రవీంద్రను తమ కస్టడీకి తీసుకొని పలు కోణాల్లో విచారించారు.

ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం..

ఫ్రిజ్‌లో శరీర భాగాలు!

మౌనికను తమ అపార్ట్‌మెంట్‌కు సమీపంలో ఉన్న తన స్నేహితుడి అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో హత్య చేసినట్టు నిందితుడు చెప్పినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. రవీంద్ర స్నేహితుడు సురేంద్రతోపాటు మరో ఇద్దరు కలిసి హత్య జరిగిన ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. గత నెల 29న స్నేహితుడు సురేంద్రకు ఫోన్‌ చేయగా, ఇంట్లో ఎవరం లేమని, డ్యూటీలో ఉన్నామని చెప్పాడు. ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడాన్ని అదనుగా భావించిన రవీంద్ర ప్రియురాలు మౌనికను పథకం ప్రకారం హత్య చేయడానికి స్నేహితుడి ఫ్లాట్‌కు తీసుకువెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో రవీంద్ర ఆవేశంతో మౌనిక నోరు, ముక్కు మూసి ప్రాణాలు తీశాడు. మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి తన ఫ్లాట్‌కు తీసుకెళ్లిపోయాడు. అక్కడ మృతదేహాన్ని ముక్కలుగా నరికి కొన్ని భాగాలను రిఫ్రిజిరేటర్‌లో, మరికొన్ని భాగాలను మంచం కింద ఉంచాడు. తల, చేతులను ఒక గోనె సంచిలో మూటగట్టి అడవివరం దరి ధారపాలెంలోని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు సురేంద్రకు ఫోన్‌లో చెప్పగా, పోలీసులకు వెంటనే లొంగిపోవాలని అతడు సూచించడంతోపాటు రాజాంలో ఉన్న నిందితుడి సోదరుడికి, గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈలోగా రవీంద్రను తమ్ముడు గాజువాక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించాడు. కాగా, ఈ హత్యపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మౌనికను హత్య చేసింది రవీంద్ర ఒక్కడేనా, ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక డబ్బుల కోసం వేధిస్తుండటం వల్లే హత్య చేశానని నిందితుడు చెప్పిన నేపథ్యంలో నిజానిజాలపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement