కంచరపాలెం: గత నెలలో గాజువాకలో దారుణంగా హత్యకు గురైన దళిత మహిళ మౌనికకు బుధవారం పలువురు సంఘాల నేతలు నివాళులర్పించారు. తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీ–1 లోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన సంతాప సభలో మహిళా, దళిత, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మౌనిక గృహంలో జరిగిన పెద్దకర్మకు హాజరై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతిశీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ మౌనికను అత్యంత కర్కశంగా హత్య చేసిన నేవీ ఉద్యోగి రవీంద్రపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రకటనల్లో పొంతన లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒకవైపు నిందితుడికి నేర చరిత్ర లేదని, మృతదేహాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో తెలియక లొంగిపోయాడని చెబుతుండగా, మరోవైపు ఇంట్లోకి కిటికీ ద్వారా వెళ్లి తాళం తీసినట్లు చెప్పడం విరుద్ధంగా ఉందని విమర్శించారు. వాస్తవాలు బయటపడాలంటే ఈ కేసుపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం డబ్బు విషయంలో జరిగిన వివాదం కారణంగానే హత్య జరిగిందని పోలీసులు చెప్పడం బాధాకరమన్నారు. కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలని కోరారు. డి. లలిత వెంకటలక్ష్మి, కొత్తపల్లి వెంకటరమణ, కె.చిన్నారావు, చింతాడ సూర్యం, సయ్యద్, సారయ్య పాల్గొన్నారు.


