వర్మకు జాక్‌పాట్‌! | Chandrababu Naidu government gives huge reward to former Pithapuram MLA | Sakshi
Sakshi News home page

వర్మకు జాక్‌పాట్‌!

Apr 9 2026 5:49 AM | Updated on Apr 9 2026 5:51 AM

Chandrababu Naidu government gives huge reward to former Pithapuram MLA

పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా 

కాకినాడలో స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి ప్రభుత్వ భూమి ధారాదత్తం 

రూ.240 – 340 కోట్ల విలువైన 3.40 ఎకరాలు కేటాయింపు 

ఆతిథ్య రంగంలో అనుభవం లేని వర్మ సంస్థకు భూ పందేరం 

కాగితాలపై బ్రాండింగ్‌ చూపించి భూ దోపిడీ.. రూ.104 కోట్ల ప్రాజెక్టుకు భూమి విలువతో కలుపుకుని రూ 280– 380 కోట్ల లబ్ధి 

ఎటువంటి టెండర్లు లేకుండానే అప్పనంగా దోచిపెడుతున్న వైనం  

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ భూ దందా కొత్త పుంతలు తొక్కుతోంది. స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ బుజ్జగింపుల కోసం ప్రభుత్వ భూమి ఎడాపెడా దోచి పెట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా పర్యాటక హోటళ్ల ప్రాజెక్టుల పేరుతో విచ్చలవిడిగా భూ దోపిడీ సాగిస్తుండటం విస్తుగొలుపుతోంది. పవన్‌ కళ్యాణ్‌ కోసం సీటు త్యాగం చేసి, అంతర్గత కలహాలతో నిత్యం రచ్చ రేపుతున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు తాజాగా ప్రభుత్వ భూమినే కట్టబెట్టేసింది. 

ఆతిథ్య రంగంలో ఎటువంటి అనుభవం లేని వర్మ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఎస్‌వీఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు కాకినాడలో రూ 240– 340 కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేసింది. వాస్తవానికి ఇక్కడ ప్రాజెక్టు విలువ కేవలం రూ.104 కోట్లు మాత్రమే. కానీ, చంద్రబాబు సర్కార్‌ మాత్రం రాజకీయ ప్రైవేటు సంస్థకు ప్రాజెక్టు ప్రతిపాదిత విలువ కంటే మూడు రెట్ల మేర లబ్ధి కలిగిస్తూ భారీ ఎత్తున భూ పందేరం చేస్తోంది.  

పెట్టుబడి గోరంత.. లబ్ధి కొండంత  
వర్మ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.85.66 కోట్లు. అయితే ఈ సంస్థ రూ.104 కోట్లతో 2 వేల మంది కూర్చునేందుకు కన్వెన్షన్‌ హాలుతో కూడిన 5 స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి దరఖాస్తు చేయడమే తడవుగా కాకినాడలో అత్యంత విలువైన భూమిని చంద్రబాబు సర్కార్‌ కట్టబెట్టేసింది. కాకినాడ పారిశ్రామిక వాడతో పాటు పోర్టు ఏరియా, బీచ్‌ ఫ్రంట్, నగర శివార్లలోనూ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వర్మ సంస్థకు కాకినాడ నడి»ొడ్డున ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్‌ (జీపీటీ) కళాశాలకు సమీపంలో హాట్‌ కేక్‌ వంటి 3.4 ఎకరాల భూమిని కేటాయించింది. 

ఇక్కడ ఎకరం రూ. 70 నుంచి రూ.100 కోట్లు వరకు ఉంటుందని అంచనా. వాస్తవానికి కాకినాడ సిటీలో ఎక్కడా ప్రభుత్వ భూములు ఖాళీగా లేవు. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిన పరిస్థితి. అంతటి డిమాండ్‌ కలిగిన ప్రాంతంలో ఎప్పుడో పిఠాపురం మహారాజు ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం టీడీపీ నేత వర్మకు ధారాదత్తం చేయడం విస్మయపరుస్తోంది. ఆ ప్రాంతంలో మార్కెట్‌ రేటు ప్రకారం ఆ భూమి విలువ రూ.240–340 కోట్లు. ఇది ఇప్పటి విలువ. 

భవిష్యత్తులో మరింత భారీగా పెరగడం ఖాయం. అలాంటిది రూ.104 కోట్ల ప్రాజెక్టుకు ఏకంగా రూ.240– 340 కోట్లు విలువైన భూమి ఇవ్వడమే కాకుండా, పెట్టుబడిలో 10 శాతం అంటే రూ.10 కోట్లు ప్రభుత్వమే తిరిగి వర్మ సంస్థకు చెల్లించనుంది. అంతేకాదు ఇతరత్రా రాయితీలు కూడా భారీగా ప్రకటించింది. పదేళ్ల పాటు స్టేట్‌ జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదని మినహాయింపునిచ్చింది. 

విద్యుత్‌ చార్జీల్లో సబ్సిడీ, ఐదేళ్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, ఆస్తి పన్ను, నీటిపన్ను, సీవేజ్‌ పన్నుల్లో రాయితీలతో కలిపి చూస్తే ఈ సంస్థకు ప్రోత్సాహకాల కిందే రూ.40 కోట్ల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. అంటే వర్మ సంస్థకు భూమితో పాటు ప్రోత్సాహకాల పేరిట ప్రభుత్వం రూ.280– 380 కోట్లు లబ్ధి చేకూరుస్తోంది. పైగా వర్మ ప్రాజెక్టుకు లబ్ధి కలిగించేందుకే చీడిలపొర కాలువ మీదుగా రహదారిని సైతం నిర్మిస్తోంది. అంటే వర్మ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.  

కాగితాలపైనే బ్రాండింగ్‌
ఆతిథ్య రంగంలో వర్మ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఎటువంటి అనుభవం లేదు. అందుకనే చంద్రబాబు సర్కార్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. బ్రాండింగ్‌ పేరుతో మసిపూసి మారేడు కాయ చేస్తోంది. వర్మ సంస్థ ‘తాజ్‌ బ్రాండింగ్‌’ పేరిట హోటల్‌ నిర్మిస్తున్నట్టు నమ్మబలికింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు సంస్థలు కన్సార్షియంగా ఏర్పడినప్పుడు ప్రాజెక్టులో ఒకరి వాటా కనీసం 26 శాతంగా ఉండాలి.

కానీ, ఇక్కడ పెట్టుబడి అంతా వర్మ సంస్థ చూపిస్తోంది. పైగా వాస్తవ ‘తాజ్‌’ నుంచి బ్రాండింగ్‌ వస్తే అది కచ్చితంగా ‘ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌(ఐహెచ్‌సీఎల్‌)’గా పరిగణిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా అగ్రిమెంట్లు, ఎంఓయూలు ఉంటాయి. ముఖ్యంగా తాజ్‌ గ్రూప్‌కు వాటా ఉంటుంది. కానీ, వర్మ ప్రాజెక్టులో కేవలం కాగితంపై మాత్రమే తాజ్‌ బ్రాండింగ్‌కు సహకారం అందిస్తున్నట్టు చూపించి, రూ.కోట్లు విలువైన భూమి 99 ఏళ్ల పాటు లీజు పేరుతో కాజేస్తుండడం గమనార్హం. 

ఇక్కడ ప్రభుత్వం పర్యాటక ల్యాండ్‌ బ్యాంక్‌ను అంగట్లో సరుకు మాదిరిగా ఆన్‌లైన్‌లో పెట్టి అప్పనంగా దోచిపెడుతోంది. వందల ఎకరాల పర్యాటక భూములను ఎటువంటి టెండర్లు లేకుండా డీపీఆర్‌ ఆధారంగా కట్టబెడుతోంది. వర్మ సంస్థకు కేటాయించిన భూమికి ఎనిమిది నెలల తర్వాత ఒక్కటే ప్రపోజల్‌ రావడంతో నెల రోజులు ఎదురు చూసిన తర్వాత ఖరారు చేసినట్టు చెప్పడం ప్రభుత్వ కుట్రను స్పష్టం చేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement