బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టేస్తారా? | CM Revanth Reddy comments in a chat with Media reporters | Sakshi
Sakshi News home page

బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టేస్తారా?

Apr 28 2026 1:46 AM | Updated on Apr 28 2026 1:46 AM

CM Revanth Reddy comments in a chat with Media reporters

‘స్పందన’ బృందాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సీతక్క, డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సజ్జనర్‌

విలీనం గురించి కవిత మాట్లాడిన దానికి కేసీఆర్‌ సమాధానమివ్వాలి

విలేకరులతో ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వస్తే కేసీఆర్‌కు తెలుస్తుంది 

కేసీఆర్‌కు కుటుంబ సభ్యులతోనే ప్రమాదం... ఆయన చావును కోరుకునే మూర్ఖులు కాంగ్రెస్‌లో లేరు 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి, ఇంకో కూటమి మధ్యే పోటీ

మా కూటమిలో సీపీఐ, సీపీఎం, కోదండరాం పార్టీలుంటాయి... 

ఆ కూటమిలో ఎవరుంటారో? 

పీసీ ఘోష్‌ నివేదిక విషయంలో బీఆర్‌ఎస్‌కు దొరికింది సింపుల్‌ రిలీఫ్‌ మాత్రమే.. 

కాళేశ్వరంపై విచారణ కోరుతూ సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తాం 

50% లోక్‌సభ సీట్లు పెంచాలని మోదీ, కిషన్‌రెడ్డికి ఏ దేవుడు చెప్పాడు? 

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు త్వరలోనే కొలిక్కి వస్తుంది... దాన్ని కోర్టు పర్యవేక్షిస్తోంది

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీతో భవిష్యత్తులో కలవబోమని తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి కేసీఆర్‌ చెప్పగలరా అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు బయటకే రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడం గురించి ఎందుకు చర్చ జరుగుతోందని, ఈ విలీనం గురించి కవిత మాటలకు కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సోమవారం మండలి కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... 

అంతా ఆ తానులోని ముక్కలే... 
‘బీఆర్‌ఎస్‌కు గతం మాత్రమే... భవిష్యత్తు లేదు. అసలు పార్టీ ఉంటుందో, మూసేస్తారో... కొత్తగా వచ్చే పార్టీ గురించి మనకెందుకు? ప్రతి కదలికకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత ఆ కదలిక నిస్తేజం అయిపోతుంది. తెలంగాణ ఏర్పాటు కోసం శ్రీకృష్ణ కమిటీ, రాష్ట్రానికి చెందిన మంత్రుల కమిటీలు కూడా అలాగే నిస్తేజం అయిపోయాయి. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ది కూడా అదే పరిస్థితి. బీఆర్‌ఎస్‌ చచ్చిన శవంతో సమానం. శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి వచ్చేది ఉండదు. 2001–14 వరకు ఆ పార్టీని ఉద్యమం, ఆ తర్వాత పదేళ్లు అధికారం బతికించాయి. ప్రజలు భరించలేనంత స్థాయికి వారి చెలాయింపు చేరుకున్నప్పుడు ఆ కుటుంబం, పార్టీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత 2023లో అధికారం నుంచి దించారు. కేసీఆర్‌ కుటుంబానికి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. పంపకాల్లో తేడాలతోనే కుటుంబ కుంపటి వచ్చింది. వాళ్లంతా ఒకటే. ఆ తానులోని ముక్కలే.   

వాళ్ల దగ్గరున్న అధికారాన్ని గుంజుకున్నా...  
కేసీఆర్‌ కిందపడి దెబ్బతగిలితే గ్రీన్‌చానెల్‌ ఏర్పాటు చేసి ఆసుపత్రికి పంపించా. నేనే వెళ్లి పరామర్శించా. ఆయన అసెంబ్లీకి వస్తే వెళ్లి యోగక్షేమాలు కనుక్కున్నా. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అధికార వారసత్వం వస్తుంది. కేసీఆర్‌ కుటుంబానికే ఆయన చావు అవసరం ఉంటుంది. కేసీఆర్‌ పోతే ఆయన ఆస్తి, పార్టీ, పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, ఫామ్‌హౌజ్‌లు నాకు రావు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని గుంజుకున్నా. ఇంకా ఆయన చావుతో నాకేం సంబంధం? కొడుక్కో, అల్లుడికో, కూతురికో ఉండొచ్చు. ఆయన బతికుంటే అధికారం రాదని, ఏదైనా చేద్దామని వారు అనుకుంటారేమో? ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. శత్రువు కాదు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మాకు ఈజీ. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి. విశ్రాంతి తీసుకునే వారి చావును కోరుకునే మూర్ఖులు కాంగ్రెస్‌లో లేరు. కేసీఆర్‌కు మందులిచ్చే ఆయన సంతకం పెట్టించుకుంటే మిగిలిన ముగ్గురి ఆశలు గల్లంతే అవుతాయి. అందుకే వారిలో ఎవరితో ఎక్కువ ప్రమాదమన్నది కేసీఆరే విశ్లేషించుకోవాలి.  

కోర్టు ఏం చెప్పింది..? 
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌పై కేసీఆర్, హరీశ్‌రావులు కమిషన్‌ ఏర్పాటు చట్టబద్ధం కాదని ప్రకటించాలని కోర్టును అడిగారు. కానీ కోర్టు చట్టబద్ధమేనని చెప్పింది. నోటీసులివ్వకుండా అభియోగాల నిర్ధారణ సరైంది కాదని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో మాత్రం సాంకేతికంగా వారికి సింఫుల్‌ రిలీఫ్‌ వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టును అడిగారు. మా అడ్వొకేట్‌ జనరల్‌ స్వయంగా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పారు. ఇందులో వారికి లభించిన ఊరట ఏంటో అర్థం కాలేదు. కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికల ఆధారంగా బాధ్యులెవరో విచారించాలని మేం సీబీఐని అడిగాం. వెంటనే విచారణ కోరుతూ నేను, మంత్రి ఉత్తమ్‌ సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీబీఐ విచారణ వద్దని బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బరాజ్‌ సందర్శన అధికారిక కార్యక్రమం. దీంతో సంబంధమున్న అధికారులంతా వస్తారు. కేంద్ర మంత్రులు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర అధికారులు కూడా వెళ్తారు. అలా వెళ్లారని మేం కూడా సస్పెండ్‌ చేయాలా? ఫార్ములా–ఈ రేస్‌ కేసులో ఏసీబీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు తొందరలోనే ఓ కొలిక్కి వస్తుంది. 

ఎలిమినేషన్‌ జరుగుతోంది 
రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రత్యర్థి ఎవరన్నది ఇప్పుడే చెప్పలేం. ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ జరుగుతోంది. వాళ్లలో కొట్టుకుని ఎవరు బయటకు వస్తారో రమ్మనండి. అప్పుడే మేం వారిని ఢీ కొంటాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి, ఇంకో కూటమి మధ్యనే పోటీ ఉంటుంది. మా కూటమిలో సీపీఐ, సీపీఎం, కోదండరాం పార్టీలుంటాయి. వాళ్ల కూటమిలో ఎవరుంటారో తెలియదు. మాది కార్మిక, కర్షక కూటమి. వాళ్లది ధృతరాష్ట్ర కూటమి.  

ఆ నాలుగు వేటికవే..! 
దేశంలో ఇప్పుడు నాలుగు అంశాలు చర్చలో ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడున్నది ఉన్నట్టు అమలు చేస్తే ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయి. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తింపచేయొచ్చు. జనాభాను క్రమబదీ్ధకరిస్తూ ఆయా రాష్ట్రాల్లో  ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ కూడా ఏడాదిన్నరలో చేయొచ్చు. ఇక, లోక్‌సభ స్థానాల పెంపుపై కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ పెంపునకు ఎంచుకున్న విధానానికే మేం వ్యతిరేకం. విధివిధానాలు ఖరారు చేసి రాష్ట్రాల మధ్య అంతరం రాకుండా అన్ని రాజకీయ పక్షాలతో చర్చించాలి. శిఖండి రాజకీయాలు చేయొద్దు. లోక్‌సభలో 2/3 వంతు మెజార్టీ లేదని, రాదని తెలిసి కూడా బిల్లులు పెట్టి మా నెత్తిమీద టెంకాయలు కొడదామనుకున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు దీనికి రిఫరెండం అని చెప్పమనండి. అసలు 50 శాతం సీట్లు పెంచాలని కిషన్‌రెడ్డి, మోదీలకు ఏ దేవుడు చెప్పాడు. జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.  

రాజ్యసభలో మాట్లాడొచ్చు కదా? 
బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై మా పార్టీ ఎంపీలు మాట్లాడింది బీఆర్‌ఎస్‌ వారికి కనిపించలేదా? వినిపించలేదా? మా ఎంపీలు చామల కిరణ్, కావ్య, మల్లురవి మాట్లాడారు. లోక్‌సభలో కుస్తీలు పట్టలేరు కదా? తేజస్వీ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు రాజ్యసభలో మాట్లాడారు. మీ మధ్య చీకటి ఒప్పందం లేకుంటే విలీనం గురించి చర్చలు ఎందుకు చేస్తున్నారు? విలీనం గురించి కవిత చెప్పిన విషయాలపై ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్‌ మాటలు, చేతల గురించి కవిత లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పండి. మన మనిషి కాదు, మర మనిíÙ, ఆయన చుట్టూ పందికొక్కులు, దోపిడీ దొంగలున్నారన్న దానికి సమాధానం చెప్పండి. కవిత ఇంటిగుట్టు కుండబద్దలు కొట్టింది. తొలుత దానికి సమాధానం చెబితే కేసీఆర్‌ నిజాయితీ ఏంటో బయటపడుతుంది’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.   

Advertisement
 
Advertisement
Advertisement