
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలది ఫెవికాల్ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా బీజేపీ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ మద్దతునిచ్చిం ది. లోక్‌సభ, రాజ్యసభల్లో త్రిపుల్ తలాక్, 370 ఆర్టీకల్, నోట్ల రద్దు, జీఎస్‌టీ, రైతు వ్యతిరేక నల్లచట్టాలు లాంటి వందల బిల్లుల ఆమోదానికి బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది..’అని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు మధ్య సంబంధం ఉందంటూ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎంఐఎంతో మాత్రమే తాము స్నేహపూర్వకంగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని మాట్లాడారు.
పదేళ్ల పాటు రెండు పార్టీలదీ ఒకే ఆలోచన
‘బీజేపీ, బీఆర్‌ఎస్ గత పదేళ్లుగా ఒకే ఆలోచనతో ప్రభుత్వాలు నడిపాయి. ఆ రెండు పార్టీలు కలిసి చర్చించుకుంటాయి. బీఆర్‌ఎస్ అంతర్గత విషయంలోనూ మోదీ మద్దతు కోరారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు అవిశ్వాసం ప్రకటించి కేటీఆర్‌ను సీఎం చేయాలని చూశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక కేసీఆర్ మోదీ దగ్గరకు వెళ్లి కేటీఆర్‌ను సీఎం చేస్తాననన్నాడు. అయితే వారసత్వ రాజకీయాలను తాను సమర్థి చనంటూ కేసీఆర్‌తో అన్నానని, మోదీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పారు.
బీజేపీతో సంబంధాలు లేకపోతే కేసీఆర్‌కు మోదీ అనుమతి ఎందుకు? కేసీఆర్ పార్టీ అంతర్గత వ్యవహారంలోనే మోదీ అనుమతి కోరారంటే, బీజేపీ, బీఆర్‌ఎస్‌లది ఫెవికాల్ బంధమేనని స్పష్టమవుతోంది. 2011లో శాసనమండలి ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ, అప్పటి టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మీనారాయణలు టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేశారు. అలాగే ఆనాడు ముగ్గురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, కావేటి సమ్మయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావులు కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుకూలంగా ఓటేశారు.
ఆ ముగ్గురు టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతు ఇచ్చినందుకే కేసీఆర్ వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పుడు ఆ ఎమ్మెల్యేలు ‘మీ అల్లుడు’ఓటేయమని చెపితే వేశామని, ఆయన్ను ఏమనకుండా మమ్మల్ని ఎలా పార్టీ నుంచి బహిష్కరిస్తారంటూ నిలదీశారు. దీంతో తిరిగి 2014లో వారికి కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. కేసీఆర్ సొంత పార్టీ నేతలకు కూడా ముఖ్యమైన విషయాలు చెప్పరు. కొన్ని చెపుతారు.. కొన్నింటిని దాస్తారు..’అంటూ రేవంత్ ధ్వజమెత్తారు.
సీఎంను మార్చాలంటే ఎవరి అనుమతి అవసరం లేదు: పోచారం
సీఎం వ్యాఖ్యలపై పోచారం స్పందించారు. ‘రేవంత్‌రెడ్డి, మేమంతా కలిసి పనిచేశాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య ఎలాంటి బంధం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ ఓడించింది. సీఎంను మార్చాలంటే ఎవరి అనుమతి అవసరం లేదు. బీఆర్‌ఎస్‌కే అప్పుడు 100 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉంది. అధికారం వస్తది పోతది. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నా. రేవంత్‌రెడ్డి చిన్న వయస్సులో సీఎం అయినందుకు మాకు ఎలాంటి ఈర‡్ష్య లేదు. ప్రజలు మమ్మలి ఇక్కడ.. వాళ్లను అక్కడ కూర్చోబెట్టారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు మా సహకారం ఉంటుంది..’అని అన్నారు.
కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చారు: పల్లా
మన్మోహన్‌సింగ్, సోనియాగాం«దీలే తెలంగాణ ఇచ్చారని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొనడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణను తెచ్చిం ది కేసీఆరేనన్నారు. బ్రిటిష్ వారు దేశానికి స్వాతంత్య్రం ఇవ్వలేదనీ, అది పోరాడి సాధించుకున్నదని చెప్పారు. అలాగే తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉండొచ్చేమో కానీ, కొట్లాడి తెచ్చిం ది మాత్రం కేసీఆరేనన్నారు.
సుష్మాస్వరాజ్‌ను మరిచారు: పాయల్ శంకర్
తెలంగాణ కోసం కృషి చేసిన వారిలో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ఉన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిందని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఆరు గ్యారంటీల గురించి మాత్రమే చెబుతున్నారని, మిగతా హమీలకు గ్యారంటీ లేదా అని ఎద్దేవా చేశారు. తాము బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల్లో ఎవరికీ దగ్గరగా లేమన్నారు.
వైఎస్సార్ లేని లోటును పూడ్చలేం: అక్బరుద్దీన్
మూసీ నది సుందరీకరణ వ్యవహారం మూడు దశాబ్దాలుగా చర్చల్లోనే ఉందని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ అన్నారు. ఈ విషయంపై అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనను పిలిపించి మాట్లాడారని, ఈ ప్రాజెక్టు చేద్దామని తనతో చెప్పారని గుర్తు చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన అకస్మాత్తుగా చనిపోయారని, ఆయనలేని లేని లోటు పూడ్చలేమని, ఆయన్ను తాము ఎంతో మిస్ అవుతున్నామని చెప్పారు. మూసీని సుందరీకరించాలన్న వైఎస్సార్ ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాకారం చేయాలని కోరారు.
ఇక హైదరాబాద్ మెట్రో రైలుపై తాను చేసిన ప్రతిపాదనను కూడా అప్పట్లో వైఎస్సార్ అంగీకరించి, ఢిల్లీకి కలిసి వెళ్లి అక్కడి మెట్రో రైలును పరిశీలిద్దామని చెప్పారని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. కాగా దళితబంధు లబ్ధిదారులను ఎమ్మెల్యేలు కాకుండా ప్రభుత్వమే గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 వేల మంది నర్సులకు పోస్టింగ్‌లు ఇవ్వడంపై అభినందనలు తెలిపారు. దావోస్ నుంచి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని అభినందించారు. రంజాన్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కోరారు.