వేధించే ఎత్తుగడే.. ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

CM KCR Opposes Changes To IAS Rules Letter To PM Modi - Sakshi

ఏఐఎస్‌ కేడర్‌ నిబంధనల సవరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: సీఎం కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి మోదీకి లేఖ

రాష్ట్రాల అధికారులను చెప్పుచేతల్లో ఉంచుకొనే ప్రయత్నమిది

ఏకపక్షంగా వ్యవహరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత కోల్పోయి నామమాత్రంగా మారిపోతాయి

దొడ్డిదారిలో కాకుండా.. ధైర్యముంటే పార్లమెంట్‌లో చట్ట సవరణకు సిద్ధపడాలి

సవరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో అఖిల భారత సర్వీసుల అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన బాధ్యతల నేపథ్యంలోనే.. వారిని డిప్యుటేషన్‌పై పంపడానికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరమయ్యేలా నిబంధ నలు ఉన్నాయని స్పష్టం చేశారు.

కానీ ఈ విధా నాన్ని ఏకపక్షంగా మార్చేసి.. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండానే అధికారులను తీసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత కోల్పోయి నామమాత్రపు సంస్థలుగా మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపాదిత సవరణలను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలోని ప్రధాన అంశాలివీ..

ఇది రాజ్యాంగాన్ని మార్చడమే..
‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 312లో ఉన్న నిబంధ నల ప్రకారం పార్లమెంటు ఆలిండియా సర్వీసెస్‌– 1951 చట్టాన్ని చేసింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించింది. కానీ రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసే విధంగా, దేశ సమాఖ్య రాజనీతిని పలుచన చేసే దిశగా అఖిల భారత సర్వీసుల (కేడర్‌) రూల్స్‌–1954కు రంగు లద్దుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రతిపాదిత సవరణ అంటే.. కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు సం బంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడం తప్ప మరొకటి కాదు.

ఈ సవరణలను ఇలా దొడ్డిదారిన కాకుండా.. ధైర్యముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరించాలి. రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలగకుండా ఉండాలంటే.. రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నాకే రాజ్యాంగ సవరణలు చేపట్టాలి. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో ఈ నిబంధనను ఆర్టికల్‌ 368 (2)లో పొందుపరిచారని కేంద్ర ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలి.

సవరణలను విరమించుకోండి
రాష్ట్రాల పాలనా అవసరాలను చిన్నచూపు చూసేలా కేంద్ర ప్రతిపాదనలున్నాయి. అఖిల భారత సేవల అధికారుల విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పరస్పర సర్దుబాటుకు గొడ్డలిపెట్టుగా ఈ సవరణలున్నాయి. వీటితో కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతింటాయి. అధికారుల సేవలను సామరస్యంగా, సమతుల్యంగా వినియోగించుకోవడానికి ప్రస్తుత ఏఐఎస్‌ (కేడర్‌) నిబంధనలు సరిపోతాయి. పారదర్శకత, రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం కేంద్రం ప్రతిపాదిత సవరణలను విరమించుకోవాలి.’’ అని ప్రధానికి లేఖలో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

పరోక్ష నియంత్రణ కోసమే..
అఖిల భారత సర్వీసుల (కేడర్‌) రూల్స్‌ను సవ రించి.. రాష్ట్రాల సమ్మతి లేకుండానే అధికారులను తీసుకోవాలనుకోవడం ప్రమాదకరం. ఇది రాజ్యాంగ చట్రం, సహకార సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవహారాల్లో కేంద్రం తలదూర్చడమే. రాష్ట్రాల్లో పనిచేసే అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి, పరోక్షంగా నియంత్రించడానికి, వారిని చెప్పుచేతుల్లో ఉంచు కోవడానికి కేంద్రం ఈ ఎత్తుగడ వేసింది. అధికారుల ముందు రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సహాయులుగా చేసే ఆలోచన ఇది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు జవాబుదారీతనంగా ఉండటంపైనా ఇది ప్రభావం చూపుతుంది. – కేసీఆర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top