సీనియర్లకు చంద్రబాబు షాక్‌  | Sakshi
Sakshi News home page

సీనియర్లకు చంద్రబాబు షాక్‌ 

Published Sun, Feb 25 2024 5:32 AM

Chandrababu Shock To Tdp Seniors In First List - Sakshi

సాక్షి, అమరావతి:  అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పలువురు ముఖ్యులు, సీనియర్‌ నాయకులకు ఝలక్‌ ఇచ్చారు. తొలి జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయి. అందులో కొందరు మాజీ మంత్రులు కూడా ఉండడం గమనార్హం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారికి సైతం సీట్లు దక్కలేదు. శ్రీకాకుళం జిల్లాలో కళా వెంకట్రావు పేరు తొలి జాబితాలో లేకపోవడంతో పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఎన్నికలకు సీటు మార్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రస్తుతం సీటు లేకుండా చేశారు.

ఆయన కోరుకున్న సీటు ఇచ్చేందుకు నిరాకరించిన చంద్రబాబు.. విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. గంటా అందుకు ఒప్పుకోకపోవడంతో తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కూడా చంద్రబాబు షాకిచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ అభ్యంతరంతో ఆయనకు సీటు ఇచ్చేందుకు వెనుకాడుతూ తొలి జాబితాలో ఆయనకు సీటు ఖరారు చేయలేదు. దీంతో చింతమనేనికి సీటు ఇవ్వడం అనుమానంగా మారింది. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పీతల సుజాతకు సైతం మొండిచేయి చూపారు.   

యరపతినేనికి ఎసరు 
ఎన్టీఆర్జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు దక్కలేదు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన హడావుడి చేస్తున్నా తొలి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. ఆయనకు సీటు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సీటు ఖరారు చేయలేదు. దీన్నిబట్టి ఆ నియోజకవర్గంలో మరొకరికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లాలో సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావుకు గురజాల సీటు ఇవ్వకపోడం చర్చనీయాంశంగా మారింది.

తొలి జాబితాలో ఆయన పేరు లేదంటే ప్రత్యామ్నాయంగా వేరే ఎవరికైనా ఇస్తారా అనే చర్చ నడుస్తోంది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు తొలి జాబితాలో సీటు దక్కలేదు. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరు ఈ జాబితాలో గల్లంతైంది. ఇప్పటికే ఐదుసార్లు ఆయన ఓడిపోవడంతో ఈసారి సీటు ఇవ్వడం కష్టమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావును పక్కనపెట్టి ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌కు సీటివ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పొత్తులో కొట్టుకుపోతున్న నేతలు 
జనసేన పొత్తులో కొన్ని సీట్లు పోవడంతో పలువురు సీనియర్లకు సీట్లు గల్లంతయ్యాయి. తెనాలి సీటు నాదెండ్ల మనోహర్‌కు ఇవ్వడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాజమండ్రి రూరల్‌ సీటు పొత్తులో పోయే అవకాశం ఉండడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మొండిచేయే మిగలనుంది. తనకు సీటు గ్యారంటీ అని ఆయన చెప్పుకుంటున్నా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టమైంది. అవనిగడ్డలో సీనియర్‌ నేత మండలి బుద్ధప్రసాద్‌కు జాబితాలో చోటు లేకుండా పోవడానికి ఆ సీటు జనసేన పొత్తు ప్రభావమేనని చెబుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి సీటును బండారు సత్యనారాయణమూర్తికి ఖరారు చేయలేదు. దీంతో ఆసీటు జనసేనకు ఇవ్వడం ఖాయమైనట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement