
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ప్రచారఅ్రస్తాలుగా బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. షెడ్యూల్ త్వరలో వెలువడుతుందనే ప్రచారం నేపథ్యంలో కార్యాచరణ వేగవంతం చేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడేలోగా ఆరువారాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన బీఆర్‌ఎస్, ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో సోమవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రి హరీశ్‌రావు స్వల్ప జ్వరంతో ఈ భేటీకి హాజరుకాకున్నా, ఆయనతో కేసీఆర్, కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం.
తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్‌ఎస్ అంటూ....
తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేననే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా రూపొందించిన కార్యాచరణను తనతో భేటీ అయిన ముఖ్యనేతలకు కేసీఆర్ వివరించినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలతో పాటు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, మూడు నెలల్లోనే వాటి అమలులో విఫలమైన తీరును వివరించేలా కరపత్రాలు, బుక్‌లెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆరు గ్యారంటీల పేరిట ఇచ్చిన 13 హామీలు కలుపుకొని మొత్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు అసాధ్యమనే విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
ఎన్నికల కార్యాచరణలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి మండలస్థాయిలో పార్టీ కేడర్‌తో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. గ్రామస్థాయిలో పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయడంతోపాటు బీఆర్‌ఎస్ పాలనలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారితోనూ భేటీ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ సిద్ధం చేసి ముఖ్యనేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తారు.
ముఖ్య నేతలకు ప్రచార సమన్వయ బాధ్యతలు
లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ నేతల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాష్ట్రస్థాయి అంశాలతో పాటు స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల వ్యూహం అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కడియం శ్రీహరి, మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటి సీనియర్ నేతలకు అప్పగించనున్నారు.
మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కూడికలు, తీసివేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా కుస్తీ పడుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ అంశంపై ఎలా స్పందించాలనే కోణంలోనూ సోమవారం జరిగిన భేటీలో కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక కూడా జరుగుతుందని బీఆర్‌ఎస్ భావిస్తోంది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగే ఈ ఎన్నికకు సంబంధించి దివంగత ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో కేసీఆర్ త్వరలో భేటీ అవుతారని పార్టీవర్గాలు వెల్లడించాయి.