
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ఆరు గ్యారంటీలతో పాటు వివిధ డిక్లరేషన్‌ల పేరిట 420 హామీలు ఉన్నాయని, వాటిని అమలు చేయకుంటే కాంగ్రెస్ నేతలను బట్టలూడదీసి ఉరికించే రోజులు వస్తాయని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. బుధవారం కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండుసార్లు అధికారమిచ్చిన ప్రజల ఆకాంక్షలకు అను గుణంగా పాలన సాగించామని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతితో, అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఓటమితో నైరాశ్యం వద్దని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఓట్ల శాతం తేడా 1.85 శాతమేనని చెప్పారు.
ప్రతిపక్ష నేత తరహాలో సీఎం పాలన
గుంపుమేస్త్రీ రేవంత్‌రెడ్డి సీఎంగా కాకుండా ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఏక్‌నాథ్ షిండేగా మారడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. రైతుబంధు పడలేదని రైతులు అంటుంటే చెప్పుతో కొడుతామంటూ మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రైతుబంధు పడని రైతులు చెప్పుతో కొడుతారో..? ఓటుతో కొడుతారో ఆలోచించుకోవాలన్నారు.
కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేలా క్యాడర్ పనిచేయాలి
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చిల్లర రాజకీయాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టి, గుంపుమేస్త్రీ రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పి రానున్న రోజుల్లో కేసీఆర్‌ను తిరిగి సీఎం చేసేలా కార్యకర్తలు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్, గజ్వేల్, దుబ్బాక, హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎవరిమీద గెలిచిందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎవరు ఎవరితో ఉన్నారు..? ఎవరు ఎవరికి బీటీమ్..? ఎవరు ఎవరితో అంటకాగుతున్నారో అర్థమయ్యేలా ప్రజాక్షేత్రంలో వివరించాలని ఆయన బీఆర్‌ఎస్ శ్రేణులకు సూచించారు. ప్రతి మండలంలో వార్‌రూం పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
వినోద్‌తో చర్చకు బండి రావాలి
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, చేతనైతే మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ చేశారు. తేదీ, సమయం, వేదిక ఎక్కడో చెబితే తామే బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సంజయ్ తెచ్చిన నిధులూ లేవు, గుడి కట్టిందీ లేదు.. బడి కట్టిందీ లేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్, జగిత్యాల ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితెల సతీశ్‌బాబు, కోరుకంటి చందర్, పార్టీ ఇన్‌చార్జీలు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్, నగర మేయర్ వై.సునీల్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, జీవీ.రామకృష్ణారావు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.