
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌కు పునాది రాళ్లు, మూల స్తంభాలు కార్యకర్తలేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గులాబీ జెండాకు వెన్నెముకలా ఉంటూ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రేపటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై బీఆర్‌ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలు మీరేనంటూ కార్యకర్తల్లో ‘ఎక్స్’వేదికగా ఉత్సాహం నింపారు. ‘ప్రాణ సమానులైన బీఆర్‌ఎస్ తోబుట్టువులారా.. ఏడాదిగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై పోరాట స్ఫూర్తిని చూపినందుకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా. గెలుపోటములతో సంబంధం లేకుండా మీరు చూపిన ఉత్సాహం రాష్ట్రస్థాయిలో నాయకత్వానికి కొండంత స్ఫూర్తినిచ్చింది.
ప్రజల పక్షాన కార్యకర్తలు విరామం లేకుండా పోరాడుతున్నారు. రైతులు, నేత కార్మికులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన సమరభేరి మోగించడంతో పాటు.. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. మూసీలో మూటల వేట మొదలుకుని లగచర్ల లడాయి వరకు జరిగిన ఉద్యమాల్లో బాధితుల పక్షాన నిలిచారు. అదానీకి రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేయటం, లగచర్ల అంశంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టడంలో పార్టీ యంత్రాంగం విజయం సాధించింది. అక్రమ కేసులతో ప్రభుత్వం వేధించినా పార్టీ వెంట కార్యకర్తలు నిలిచిన తీరు అపూర్వం, అసాధారణం’అని కేటీఆర్ అన్నారు.