
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ అని తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తన పోరును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్‌లో జరిగిన సెప్టెంబర్ 17 వేడుకల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ రాజ్యాన్ని సాధించేందుకు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సెప్టెంబరు 17వ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలంగాణ బిడ్డలు రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన రోజని అన్నారు. ఈ రోజును విమోచనమని అన్నా, విలీనమని అన్నా ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన దినం అన్నది వాస్తవమని చెప్పారు. ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ బీఆర్‌ఎస్ తరపున శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కేటీఆర్..‘తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం.. అన్నింటినీ తెలంగాణ చూసింది’ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని గ్రూప్-1 విద్యార్థులు తమ ఆకాంక్షను వ్యక్తం చేసుకునేందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో దాడి చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తన పోరును కొనసాగిస్తుందని, సెప్టెంబరు 17వ తేదీని సమైక్య దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదన్నారు. పార్టీ సీనియర్ నేతలు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు.