
పార్టీ శ్రేణులతో కేసీఆర్
క్షేత్రస్థాయిలో బీజేపీకి సరైన బలగం లేదు
ఏదో ప్రధాని మోదీని చూపి హడావుడి చేస్తున్నారు
పార్టీని వీడి వెళ్తున్నవారికి అక్కడ ఆదరణ దక్కదని స్పష్టీకరణ
కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరణ ఉండబోదని.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీని చూపి ఏదో హడావుడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీజేపీకి సరైన అభ్యర్థులు దొరకనందునే బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఇతర నేతలను చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల బలగం లేదని.. అందుకే అరూరి రమేశ్ వంటి నేతలను చేరాలని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బుధవారం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో సమావేశమయ్యారు. అక్కడి తాజా రాజకీయ స్థితిగతులు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై చర్చించారు. పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వివరాలు కేసీఆర్ మాటల్లోనే..
‘‘దూరపు కొండలు నునుపు అన్నట్టు బీఆర్‌ఎస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న నేతలకు అక్కడ పెద్దగా ఆదరణ ఏమీ ఉండదు. బీఆర్‌ఎస్ నేతలను చేర్చుకోవడం ద్వారా తమ బలం పెరిగిందనే ప్రచారం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. అందుకే కండువాలు కప్పి తమ వారు అనిపించుకునేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.
కాంగ్రెస్, బీజేపీలకు నిజంగా బలముంటే వారి పార్టీల్లోనే అభ్యర్థులు ఎందుకు దొరకడం లేదు? బీజేపీ తాజాగా ప్రకటించిన జాబితాలో ఒక్కరైనా ఆ పార్టీలో పుట్టి పెరిగిన నేతలున్నారా? భవిష్యత్తులో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అసాధ్యమని ప్రజలకు అర్థమవుతోంది. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ బీఫారం ఇస్తే చాలు గెలుపు ఖాయమనే పరిస్థితి వస్తుంది.
కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరుగుతోంది
క్షేత్రస్థాయిలో సాగునీరు, విద్యుత్, తాగునీటికి సమస్యలు నెలకొన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. కాంగ్రెస్ సర్కారుపై పెరుగుతున్న ఈ ప్రజా వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు బీఆర్‌ఎస్ ముఖ్యులు, మాజీ ఎమ్మెల్యేలు కలసికట్టుగా పనిచేయాలి..’’అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
కాగా.. వరంగల్ లోక్‌సభ స్థానంలో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందన్న దానిపై భేటీకి హాజరైన నేతలను కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ భేటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినయ్‌భాస్కర్, నరేందర్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.