BJP Mission Telangana: పకడ్బందీ వ్యూహంతో.. కమలం ‘మిషన్‌ తెలంగాణ’

BJP Special Focus On Mission Telangana Come To Power In Next Election - Sakshi

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా..  

సంజయ్‌ పాదయాత్రలో అగ్రనాయకత్వం పకడ్బందీ వ్యూహం 

మొత్తం మోదీ, అమిత్‌ షా, నడ్డాల కనుసన్నల్లోనే 

పర్యవేక్షణకు ఇప్పటికే రంగంలోకి ప్రత్యేక బృందాలు 

సంగ్రామ యాత్రతో కేడర్‌లో నయాజోష్‌ 

రాష్ట్రానికి 17న రానున్న అమిత్‌ షా, అక్టోబర్‌ 2న నడ్డా 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టి ‘మిషన్‌ తెలంగాణ’తో ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార సాధనే ధ్యేయంగా పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనుసన్నల్లో వ్యూహరచన చేస్తోంది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే స్థాయి, బలం ఇతర విపక్ష పార్టీలకు లేకపోవడంతో ఆ ఖాళీని సమర్థవంతంగా పూరించి ఏౖక ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న భావన ప్రజల్లో ఏర్పడేలా దూకుడుగా కార్యాచరణ చేపడుతోంది.

ప్రభుత్వ హామీల అమల్లో వైఫల్యాలతో పాటు బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్‌ చేసి వారు బీజేపీ వైపు మొగ్గేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సర్కార్‌పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, అసంతృప్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా దీనిని అమలు చేస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను గెలిపించుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌ పతనానికి శ్రీకారం చుట్టాలని అధినాయకత్వం దిశానిర్దేశం చేసింది.  

పాదయాత్రతో కీలక మలుపునకు... 
పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపడుతున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ముఖ్యమైన సాధనంగా వాడుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ పాదయాత్ర ద్వారా పార్టీ బలోపేతంతోపాటు, ప్రభుత్వం ఏయే రంగాల్లో విఫలమైందో అంశాల వారీగా ఎండగట్టి ప్రజా మద్దతును కూడగట్టాలని భావిస్తోంది. ఇందుకోసం అమిత్‌ షా పర్యవేక్షణలో పనిచేసే ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటికే పనిచేయడం మొదలుపెట్టింది.

ఈ బృందం ‘ప్రజా సంగ్రామ యాత్ర’వెంటే సాగుతూ ఎప్పటికప్పుడు అమిత్‌ షా, నడ్డాలకు నివేదికలు పంపుతోంది. అన్ని స్థాయిల్లోని నాయకులు ఈ యాత్రలో ఎంతమేరకు భాగస్వాములవుతున్నారు.. కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొనేందుకు ఏం చేయాలి తదితర అంశాలను విశ్లేషిస్తోంది. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మీడియాను ఆకర్షించేందుకు కార్యక్రమాలు చేపట్టేలా, సామాజిక మాధ్యమాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై చర్చలు నిర్వహించేలా వ్యూహరచన చేస్తోంది.  

6 రోజుల యాత్రపై సంతృప్తి 
గతంలో వివిధ అంశాలపై యాత్రలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా పార్టీ అధ్యక్షుడు పాల్గొంటున్న పాదయాత్ర ఇదే మొదటిది కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆరు రోజులుగా సాగుతున్న సంజయ్‌ యాత్రకు కేడర్, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు జాతీయ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ యాత్రలో పాల్గొంటామంటూ ఇప్పటికే లక్ష మందికి పైగా కార్యకర్తలు నమోదు చేసుకున్నారని రాష్ట్ర పార్టీ ముఖ్యనేత ‘సాక్షి’కి తెలిపారు. చార్మినార్‌ వద్ద పాదయాత్ర ప్రారంభ సభ అంచనాలకు మించి విజయవంతం కావడంతోపాటు కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపిందనే అభిప్రాయాన్ని అధినాయకత్వం వ్యక్తం చేసింది.

రెట్టించిన ఉత్సాహంతో మిగిలిన యాత్రను కూడా పూర్తిచేయాలని చెప్పింది. యాత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సాగుతోందని, టీఆర్‌ఎస్‌–ఎంఐఎం దోస్తీని ఎండగట్టడం, సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచనను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడాన్ని ఎత్తిచూపడం, నిజాం ఆస్తులు స్వాధీనం చేసుకుంటామంటూ చేసిన ప్రసంగాల ద్వారా హిందూ ఓటు బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకోవాలనే వ్యూహం విజయవంతం అవుతుందనే ధీమాను ముఖ్యనేతలు వ్యక్తంచేశారు. 

రాష్ట్రానికి ముఖ్యనేతలు 
సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లో పార్టీ నిర్వహించే బహిరంగసభలో అమిత్‌ షా, అక్టోబర్‌ 2న పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. వికారాబాద్‌లో నిర్వహించే సభలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆ తర్వాత జరగనున్న కార్యక్రమాల్లో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. యాత్ర సందర్భంగా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top