BS Yediyurappa: యడియూరప్ప వారసుడెవరు?

BJP Frontrunners For Next Karnataka CM - Sakshi

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా తెరపైకి పలువురి పేర్లు 

రోజురోజుకూ పెరిగిపోతున్న ఆశావహుల సంఖ్య 

సీఎం రేసులో ప్రహ్లాద్‌ జోషీ, సి.టి.రవి, బి.ఎల్‌.సంతోష్‌ 

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బలమైన లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బి.ఎస్‌.యడియూరప్ప(78) మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. యడియూరప్ప వారసుడు ఎవరన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తదుపరి సీఎం రేసులో తాము ముందంజలో ఉన్నామంటూ పలువురు నాయకులు లీకులిస్తున్నారు. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జాబితాలో కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని కర్ణాటక బీజేపీలోని ఒకవర్గం వాదిస్తుండగా, మార్పు తథ్యమని మరో వర్గం బల్లగుద్ది మరీ చెబుతోంది. యడియూరప్ప స్థానంలో బలమైన నేతను నియమించడం పార్టీకి సవాలేనని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. 

అనుకున్నంత సులభం కాదు 
కర్ణాటకలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ సజావుగా సాగాలంటే యడియూరప్ప వారసుడిగా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని మాస్‌ లీడర్‌ కావాలని చెబుతున్నారు. అలాంటి నేతను వెతికి పట్టుకోవడం అనుకున్నంత సులభం కాదని బీజేపీ కార్యకర్తలే పేర్కొంటున్నారు. కులాల మధ్య సమతూకం పాటిస్తూ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిదేనని అంటున్నారు. లింగాయత్‌ వర్గం జనాభా కర్ణాటకలో 16 శాతానికి పైగానే ఉంది. దీంతో ఈ వర్గాన్ని విస్మరించలేని పరిస్థితి. లింగాయత్‌లు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పిస్తారన్న వార్తల పట్ల ఈ వర్గం గుర్రుగా ఉంది. లింగాయత్‌ల ఆగ్రహానికి గురైతే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. 

ఒక్కళిగ వర్గంలో పట్టుకోసం ఆరాటం 
కర్ణాటక తదుపరి సీఎంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, బీజేపీ నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ బి.ఎల్‌.సంతోష్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జోషీ, సంతోష్‌ బ్రాహ్మణ సామాజికవర్గం నేతలు. సి.టి.రవి ఒక్కళిగ వర్గం నాయకుడు. అయితే, బీజేపీ అధిష్టానం అనూహ్యంగా కొత్త నేతను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఒక్కళిగ కూడా బలమైన సామాజిక వర్గమే. ఈ వర్గంలో పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం రేసులో మరో బ్రాహ్మణ నాయకుడు, అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్డే ఖగేరీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. రామకృష్ణ హెగ్డే తర్వాత 1988 నుంచి ఇప్పటిదాకా కర్ణాటక సీఎంగా బ్రాహ్మణులకు అవకాశం దక్కలేదు. బీజేపీలో యడియూరప్ప ప్రత్యర్థి, సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ తనకు సీఎం పదవి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన వీర హిందుత్వవాదిగా పేరుగాంచారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ నెగ్గాలంటే హిందుత్వవాదికే పట్టం కట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారని, అందులో భాగంగానే తనవైపు మొగ్గు చూపుతున్నారని బసనగౌడ సంకేతాలిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా మంత్రులు మురుగేష్‌ నిరానీ, బసవరాజ్‌ ఎస్‌.బొమ్మై, ఆర్‌.అశోక్, సి.ఎన్‌.అశ్వత్థ నారాయణ్, జగదీష్‌ షెట్టర్‌(మాజీ సీఎం), ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాద్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

ఎమ్మెల్యేలకు విందు వాయిదా 
కర్ణాటక సీఎం యడియూరప్ప ఈ నెల 25న తలపెట్టిన విందు వాయిదా పడింది. సీఎంగా రెండేళ్ల పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో బెంగళూరులోని ఓ హోటల్‌లో బీజేపీ ఎమ్మెల్యేలకు భారీ విందు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. అయితే, ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల నేపథ్యంలో ఈ విందు వాయిదా పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. విందు కోసం తదుపరి తేదీని ఇంకా ఖరారు చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. యడియూరప్ప గత వారమే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. సీఎం మార్పుపై చర్చించడానికే యడియూరప్పను పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిపించారన్న వార్తలు వెలువడ్డాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top