BRS Meeting: కేసీఆర్‌ సభకు బిహార్‌ సీఎం గైర్హాజరు.. కారణమిదేనన్న నితీష్‌ కుమార్‌

Bihar Cm Nitish Kumar Response Day After KCR Led Opposition Rally - Sakshi

పాట్నా: ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ తొలి బహిరంగ సభకు పలువురు జాతీయ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, సీపీఎం జాతీయ కార్యదర్శి డి రాజా తదితరులు పాల్గొన్నారు. అయితే 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌యేతర ప్రతిపక్షాల ఐక్యత భేటీగా భావిస్తున్న ఈ భారీ సభకు పలువురు సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. వారిలో బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఒకరు.

గతేడాది ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన నితీష్‌ కుమార్‌, కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధపడుతున్నారు. అంతేగాక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు సాయం  కోరుతూ గతంలో కేసీఆర్‌ సైతం పాట్నా వెళ్లి నితీష్‌ను కలిసిన విషయం విదితమే. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ సభకు నితీష్‌ తప్పకుండా హాజరవుతారని అంతా భావించినప్పటికీ ఆయన‌ హాజరు కాలేదు. దీంతో బిహార్‌ సీఎం రాకపోవడానికి గల కారణాలపై చర్చ జరుగుతోంది. నితీష్‌ను కేసీఆర్‌ ఆహ్వానించలేదని, లేదా ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని, అందుకే కేసీఆర్‌ ఆయన్ను పక్కకు పెట్టారని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన

తాజాగా కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాల నేతల భేటీకి గైర్హాజరు కావడంపై నితీష్‌ కుమార్‌ స్పందించారు. కేసీఆర్‌ చేస్తున్న ర్యాలీ గురించి తనకు తెలియదని అన్నారు. తాను వేరే పనుల్లో బిజీగా ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఆహ్వానం అందిన వారే తప్పక అక్కడికి వెళ్లి ఉంటారని పేర్కొన్నారు. అంతేగాక తనకు ఒకే ఒక్క కోరిక ఉందని.. తనకోసం తనేమి కోరుకోవడం లేదని అన్నారు.

‘నాకోసం ఏది అవసరం లేదని ఎప్పటి నుంచో చెబుతున్నాం. నాకు ఒకే ఒక కల ఉంది. ప్రతిపక్ష నాయకులు ఏకమై ముందుకు సాగడం. అది దేశానికి మేలు చేస్తుంది’ అని నితీష్ కుమార్ గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆహ్వానంపై బీఆర్‌ఎస్‌ బహిరంగ సమావేశానికి ప్రముఖ ప్రతిపక్ష నాయకులు హాజరై ప్రసంగించిన మరుసటి రోజే బీహార్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ స్థాయిలో నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభ ఇదే. దీనిని 2024 జాతీయ ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు తొలి ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నాయి.

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top