బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పుకునేలా చేసి డీకే శివకుమార్‌కు ఆ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రచారానికి బలాన్నిస్తున్నాయి. గురువారం మీడియాతో మాట్లాడతానని సిద్ధరామయ్య అన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.
సిద్ధరామయ్యకు కాంగ్రెస్ షాక్!
తాజాగా, న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం తర్వాత సిద్ధరామయ్య వర్గానికి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత అగ్రనేత రాహుల్ గాంధీ తన నివాసానికి వెళ్లి తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీతో చర్చించారు. ఆ సమయంలో శివకుమార్‌కు ఇచ్చిన హామీ గుర్తుచేసిన సోనియా గాంధీ దాన్ని అమలు చేసే సమయం వచ్చిందని సూచించినట్టు తెలుస్తోంది. శివకుమార్‌కు ఎప్పటి నుంచో మద్దతుగా నిలిచిన ప్రియాంక గాంధీ కూడా పార్టీకి ఆయన చూపిన విధేయత దృష్ట్యా ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని వాదించినట్టు సమాచారం.
లంచ్ బ్రేక్ తర్వాత మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, సిద్ధరామయ్య, శివకుమార్ మరోసారి సమావేశమైన వేళ రాహుల్ గాంధీ లోపలికి వచ్చి నేరుగా సిద్ధరామయ్యను చూస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. ఆ వార్త విన్న వెంటనే సిద్ధరామయ్య ముఖంలో షాక్ స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం ఎన్నికల అంశాలపైనే చర్చ జరిగిందని, మిగతావన్నీ ఊహాగానాలేనని మీడియాకు చెప్పారు.
1992లోనూ ఇలాంటి పరిణామాలు
తాజాగా, చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ 1992 ఘటనను గుర్తుచేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేత ఎస్.బంగారప్ప ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంపై అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి బంగారప్పపై ఫిర్యాదులు చేసేవారు.
అప్పుడు ప్రధానమంత్రి పీవీ నరసింహరావు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కర్ణాటక రాజకీయ పరిణామాలు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఒక రోజు బంగారప్పను ఢిల్లీకి పిలిపించారు. ప్రధానమంత్రి నివాసానికి వెళ్లిన బంగారప్ప ఎదుట పీఎంవో సిద్ధం చేసిన భారీ ఫైల్ ఉంచిన నరసింహరావు, కొన్ని ఫిర్యాదులు చదివి ఆయన స్పందన అడిగారని ప్రచారం జరిగింది. బంగారప్ప మౌనంగా ఉండటంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తున్నానని తెలిపారు. బెంగళూరులో రాజ్ భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించాలని చెప్పినట్టు అప్పట్లో ఢిల్లీలో పనిచేసిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చేసేది ఏమీలేక బంగారప్ప రాజీనామా
బంగారప్ప బయటకు రాగానే మీడియా ఆయనను రాజీనామా చేస్తారా? అంటూ పలు ప్రశ్నలు అడిగింది. సమాధానం చెప్పకుండా బంగారప్ప చాణక్యపురిలోని కర్ణాటక భవన్‌కు వెళ్లి తన అనుచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వెంటనే బెంగళూరుకు ఫోన్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు వేలాది మంది మద్దతుదారులను విమానాశ్రయానికి రప్పించాలని ఆదేశించారు.
వెనుకబడిన వర్గాల ప్రజలు అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తారని, ఎమ్మెల్యేల మద్దతుతో రాజకీయ సంక్షోభం సృష్టించి ప్రధానమంత్రి నిర్ణయాన్ని మార్చగలనని బంగారప్ప భావించారు. అయితే మరుసటి రోజు ఆయన విమానం బెంగళూరు విమానాశ్రయానికి చేరేసరికి అక్కడ కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, కొన్ని వందల మంది మద్దతుదారులే కనిపించారు. ఆ తర్వాత బంగారప్ప ఆలస్యం చేయకుండా రాజ్ భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రిగా 1992 నవంబర్ 19న బాధ్యతలు స్వీకరించారు.
సిద్ధరామయ్య కర్ణాటకలో వెనుకబడిన వర్గాల నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నాయకుడిగానూ రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంతో ఆయన మౌనంగా ఉంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ అధిష్ఠానం చెబితే ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో..?


