లిక్కర్‌ డబ్బులు పంచుకోడానికొచ్చారు 

Bandi Sanjay comments over kcr - Sakshi

కేసీఆర్‌తో ఢిల్లీ, పంజాబ్‌ సీఎంల భేటీ అందుకే.. 

ఖమ్మం నిరుద్యోగ మార్చ్‌లో బండి సంజయ్‌ ఆరోపణ 

కొలువులు రావాలంటే కమలం రావాలని వ్యాఖ్య 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: లిక్కర్‌ దందా డబ్బులు పంచుకోవడానికే ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌ దగ్గరికి వచ్చారని, వీరందరిదీ స్కాచ్‌ బాటిల్‌ దోస్తానా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.

ఆప్‌ నేతలు ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి డుమ్మా కొట్టి హైదరాబాద్‌కు రావడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, యువత ఐదు నెలలు ఓపిక పడితే రాక్షస పాలన పోయి రామరాజ్యం వస్తుందని చెప్పారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌ సభలో సంజయ్‌ ప్రసంగించారు.  

ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలు 
కేసీఆర్‌ కుటుంబం వేల కోట్లు దోచుకుని విదేశాల్లో పెట్టుబడులు పెడుతోందని బండి ఆరోపించారు. తెలంగాణ కోసం 1,400 మంది యువత ఆత్మ బలిదానం చేసుకుంటే వారికి అన్యాయం చేసి, కేసీఆర్‌ కుటుంబమే ఉద్యోగాలు పొందిందని పేర్కొన్నారు. డిపాజిట్లు రాని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ను లేపేందుకు కొందరు ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు.

ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ చేస్తుంటే.. ఆ రెండు పార్టీలు ఒక్కటై కుట్రలు చేస్తున్నాయన్నారు. కమ్యూనిస్టు పార్టీలను ఒకప్పుడు సూది, దబ్బణం లేని పార్టీలంటూ కేసీఆర్‌ విమర్శించారని, ఇప్పుడు ఆ పార్టీల నేతలు ఆయన మోచేతి నీళ్లు తాగుతున్నారని సంజయ్‌ ఎద్దేవా చేశారు.

ఐదునెలల్లో బీఆర్‌ఎస్‌ దుకాణం మూతపడటం ఖాయమన్నారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను తీసుకొచ్చారా? సీతారామ ప్రాజెక్టు పూర్తయిందా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. భద్రాద్రి రాముడికి రూ.100 కోట్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ ఏమైందో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేకున్నా, ఒక సెక్షన్‌ మీడియా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను కలిపేందుకు, ఆ పార్టీల గ్రాఫ్‌ పెంచేందుకు తంటా లు పడుతోందని సంజయ్‌ మండిపడ్డారు. 

బీజేపీ రాగానే జాబ్‌ క్యాలెండర్‌ 
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు అధికారం ఇస్తే యువత సూసైడ్‌ నోట్‌ రాసుకున్నట్లేనని, కొలువులు కావాలంటే కమలం రావాల్సిందేనని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు.

ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం అందజేస్తామని, పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. సభలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు,  సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top