
కమలాపురం సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందేలా పకడ్బందీ కార్యాచరణ
పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముదిగొండ: తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన సాగునీటి వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని, తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బనకచర్ల పాపం బీఆర్‌ఎస్‌దేనని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ కుట్రలను అడ్డుకుని తీరతామని అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న 10 వేల మెట్రిక్ టన్నుల గోదాముల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 5.91 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములే రైతులకు అందుబాటులో ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్తగా 10.75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మించామని తెలిపారు. అన్నదాతల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. దాని ఫలితంగానే దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు.
సీఎం, ఉత్తమ్ వల్లే బనకచర్లకు బ్రేక్
ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా రాష్ట్రంపై అవే కుట్రలు జరుగుతున్నాయని భట్టి చెప్పారు. తెలంగాణలో పంటలు ఎండిపోయేలా ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సమర్థంగా వాదనలు వినిపించడం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడిందని చెప్పారు.
కృష్ణా, గోదావరిపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే పంటలకు నీరందుతోందని, బీఆర్‌ఎస్ హయాంలో ఒక్కటి కూడా పనికొచ్చే ప్రాజెక్టు నిర్మించలేదని విమర్శించారు. రూ.లక్ష కోట్లు వెచ్చించిన కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు కూడా నీరందడం లేదన్నారు. నాడు పోలవరం నిర్మిస్తుంటే చోద్యం చూశారని, బనకచర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తోందని భట్టి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.