
సాక్షి, విజయవాడ: తెలుగు చలన చిత్ర పరిశ్రమ(TFI)పై నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వంపై పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్లు, నిర్మాతలు, లీజుదార్లుపై విల్లు ఎక్కిపెట్టిన ఆయన.. వారిని టార్గెట్ చేస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేశారు.
తన చిత్రం హరిహర వీరమల్లు కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిన్న తన మంత్రి దుర్గేష్ చేత.. థియేటర్లపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇవాళ నేరుగా తన కార్యాలయం నుండి హెచ్చరికతో కూడిన ఒక ప్రకటన విడుదల చేయించారాయన.
‘‘గతంలో అల్లుఅరవింద్, అశ్వనీదత్, దిల్ రాజు, సుప్రియ, చినబాబు, నవీన్ ఎర్నేని కలిశారు. అందరినీ రమ్మంటే ఎవ్వరూ రాలేదు. తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా వచ్చి మమ్మల్ని సినిమా సంఘాలు కలవలేదు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కూడా కలవలేదు. కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కలుస్తున్నారు. ఇకమీద సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరపేది లేదు. వ్యక్తిగతంగా చర్చలుండబోవు.
.. వ్యక్తిగతంగా వచ్చి టిక్కెట్ ధర పెంచమని కోరడం(Tickets Rate Hike) ఎందుకు..?. అందరినీ కలిసి రమ్మంటే ఎవ్వరూ రాలేదు..?. ఇది మాకు తెలుగు సినిమాలో కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఈ రిటర్న్ గిఫ్ట్‌కు తగ్గట్లే మేమూ పని చేస్తాం.
సినిమా థియేటర్ల ఆదాయంపై ఆరా తీస్తున్నాం. థియేటర్లను యజమానులు నడపడం లేదు. లీజు దారులే థియేటర్లను నడుపుతున్నారు. లీజు దార్ల నుండి పన్ను వస్తుందా లేదా..? అని పరిశీలిస్తున్నాం. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ అధిక ధరలను కూడా తనిఖీ చేస్తాం. థియేటర్ల పైకి తనిఖీ బృందాలను పంపుతాం. మల్టీప్లెక్స్ లలో టిక్కెట్ల ధరలపై కూడా విచారణ జరుపుతాం. మల్టీప్లెక్స్ లలో ఆహారపదార్థాలపై కూడా తనిఖీలు చేస్తాం. ఇకమీదట కేవలం సినిమా సంఘాలతోనే చర్చిస్తాం’’ అని పవన్ పేరిట ప్రకటన వెలువడింది.