సాక్షి ఎన్టీఆర్ జిల్లా: రెడ్‌బుక్ పేరుతో మంత్రి లోకేష్ చేస్తున్న బెదిరింపులకు ఎట్టిపరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇబ్రహీంపట్నంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి జోగి రమేష్ ను అక్రమంగా 83 రోజుల పాటు జైల్లో పెట్టించి చంద్రబాబుకు ఆయనపై ఉన్న కక్ష తీర్చుకున్నారన్నారు. అయితే అన్యాయంగా జైల్లో ఉంచడంతో ప్రజల్లో ప్రస్తుతం జోగిరమేశ్‌కు క్రేజ్ పెరిగిందన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటుందని వైస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉన్న వారందరిపై కేసులు పెట్టి జైళ్లో తోస్తుందన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు ఎంత హింసిస్తే వైఎస్సార్సీపీ నేతలు అంత పట్టుదలగా పార్టీ బలోపేతానికి సిద్ధపడతారని తెలిపారు.
ప్రజలంతా మళ్లీ వైఎస్ జగన్‌నే సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే పరోక్షంగా జనం సంతృప్తిగా లేరని తెలిపారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వాటిని తప్పుదోవ పట్టించడానికి కూటమి ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందన్నారు. చంద్రబాబు , లోకేష్‌ల పోకడే వారి పతనానికి నాంధి అని ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట నడిచిన వారు రెడ్ బుక్ పేరుతో చేస్తున్న బెదిరింపులకు భయపడతారా అని అంబటి రాంబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు.
తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయం చేశారని లడ్డూ కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. తిరుమలలో లడ్డూ తయారికీ దశలవారిగా నెయ్యిపరీక్ష చేస్తారన్న సంగతి ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పును దేవుడు కూడా క్షమించడని అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబుకు ఆయన విగ్రహాం పెట్టే అర్హత ఎంతమాత్రం లేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వైఎస్సారీపీ నేతలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


