Puducherry: పట్టు వీడని రంగన్న..! 

BJP Demands For Deputy CM And Assembly Speaker Posts In Pondicherry - Sakshi

సాక్షి, చెన్నై : బీజేపీ డిమాండ్లకు తలొగ్గేది లేదన్నట్టుగా పుదుచ్చేరి సీఎం రంగస్వామి సంకేతలిస్తున్నారు. దీంతో స్థానిక బీజేపీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. పరిస్థితిని చక్క దిద్దేందుకు హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కేంద్రం రంగంలోకి దించింది.  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – ఎన్‌ఆర్‌కాంగ్రెస్‌ కూటమి పుదుచ్చేరి అధికార పగ్గాలు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. పది స్థానాల్లో గెలిచిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత రంగస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న తమకు డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్‌తో పాటుగా, రెండు కీలక శాఖలతో కూడిన మంత్రి పదవుల్ని కట్ట బెట్టాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

ఈ అంశం రంగస్వామిని సంకటంలో పడేసింది. అదే సమయంలో తమ బలాన్ని పెంచుకునే రీతిలో స్వతంత్ర ఎమ్మెల్యేలను తమ వైపుగా బీజేపీ తిప్పుకోవడం వంటి పరిణామాల్ని రంగస్వామి నిశితంగానే పరిశీలిస్తూ వచ్చారు. ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి బీజేపీ బలం తాజాగా 12కు చేరడాన్ని రంగస్వామి తీవ్రంగానే పరిగణించి ఉన్నారు. దీంతో బీజేపీ ముఖ్య నేతలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వక పోవడం చర్చకు దారి తీసింది. 

ఢిల్లీలో చర్చోపచర్చలు.. 
పుదుచ్చేరి బీజేపీ నేత నమశ్శివాయం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ నిర్మల్‌కుమార్‌ సురానాతో పాటుగా పలువురు నేతలు ఆదివారం పదవుల పంచాయతీని ఢిల్లీకి తీసుకెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రంగన్న తీరుపై ఫిర్యాదు చేశారు. సోమవారం పుదుచ్చేరికి చేరుకున్న నేతలు రంగస్వామితో భేటీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో పుదుచ్చేరిలో పదువుల వివాదాన్ని పరిష్కరించేందుకు హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కేంద్ర రంగంలోకి దించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. మంగళవారం లేదా బుధవారం కిషన్‌రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
చదవండి: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోబోం: ఏఐఏడీఎంకే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top