సబ్బినాడు.. దూకుడు! | - | Sakshi
Sakshi News home page

సబ్బినాడు.. దూకుడు!

Oct 11 2026 12:33 AM | Updated on Oct 11 2026 12:33 AM

సబ్బినాడు.. దూకుడు!

జిల్లాల విభజనకు నేటికి పదేళ్లు

2016లో నాలుగు భాగాలుగా విడిపోయిన పాత కరీంనగర్‌

సదుపాయాల్లో ముందంజలో కొత్త జిల్లాలు

పారిశ్రామిక, రైల్వే, ప్రాజెక్టులు, వ్యవసాయంలో మేటి

కొత్త మున్సిపాలిటీలు, మండలాల ఆవిర్భావం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ చరిత్ర ప్రాచీనమైంది. శాతవాహనులు, కాకతీయలు పాలించిన నగరం. దీన్నే పూర్వం సబ్బినాడు, ‘వెలిగంతుల’ (ఎల్‌గందల్‌) అని పిలిచేవారు. 1905కు ముందు ఈ ప్రాంతం ఎలగందల్‌ జిల్లాగా ఉండగా, 1905లో ఆరవ నిజాం అసఫ్‌ జా (మహబూబ్‌ అలీ ఖాన్‌) హయాంలో ఎలగందల్‌ నుంచి కరీంనగర్‌కు మార్చారు. 1948లో సైనిక చర్య తరువాత హైదరాబాద్‌ సంస్థానం నుంచి ఇండియాలో విలీనమైంది. విప్లవాల పురిటిగడ్డ కరీంనగర్‌ జిల్లాను పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం నాలుగు జిల్లాలుగా విభజించింది. 2016 అక్టోబరు 11న 57 మండలాలు దాదాపు 1100 గ్రామాలతో సువిశాలంగా ఉన్న ఉమ్మడి జిల్లా నుంచి జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఆవిర్భవించాయి. కొన్ని మండలాలు జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండలో విలీనం అయ్యాయి. ఈ దశాబ్దకాలంలో నాలుగు కొత్త జిల్లాలు వ్యవసాయ, వైద్య, విద్య, పారిశ్రామిక, రవాణా, ఆధ్మాత్మిక, పర్యాటక తదితర అనేక రంగాల్లో చక్కటి పురోగతి సాధించాయి. అన్ని కొత్త జిల్లాలకు కలెక్టరేట్‌, జిల్లా పోలీసు భవనాలు, ఎమ్మెల్యే కార్యాలయాలు, మెడికల్‌ కాలేజీలు నిర్మించారు. పలు గ్రామాలు అర్హత ఆధారంగా మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీలుగా ఆవిర్భవించాయి. దశాబ్దకాలంలో నాలుగు జిల్లాల్లో జరిగిన చెప్పుకోదగిన అభివృద్ధిని ఒకసారి గుర్తుచేసుకుందాం!

పెద్దపల్లి: పెద్దపల్లి పారిశ్రామికంగా పురోగతి సాధించింది. రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ప్రాజెక్టు, రామగుండం– మణుగూరు రైల్వేలైన్‌, ఎన్టీపీసీ విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. పెద్దపల్లికి బస్‌ డిపో మంజూరైంది. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లకు మున్సిపాలిటీ హోదాలు దక్కాయి. జిల్లాకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కాలేజీ, పోలీస్‌ కమిషనరేట్‌, ఏసీపీ ఆఫీసులు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉమ్మడి పాత జిల్లాలోనే ఉండటం గమనార్హం.

కరీంనగర్‌: జిల్లాల విభజనతో పలు వాగులు, గోదావరి నది, సింగరేణి గనులు, కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకు దూరమైంది. ఏ అటవీ ప్రాంతం లేని జిల్లాగా మిగిలింది. సదుపాయాలపరంగా మంచి అభివృద్ధి సాధించింది. స్మార్ట్‌సిటీతో నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు బాగుపడ్డాయి. జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వచ్చింది. కొత్త కలెక్టరేట్‌ భవనం, కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే లైన్‌, తీగల వంతెన, మానేరు రివర్‌ ఫ్రంట్‌, ఎన్‌హెచ్‌–563 వంటి రూ.వందల కోట్ల ప్రాజెక్టులు వచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌కు ఆదరణ పెరిగింది. చొప్పదండికి మున్సిపాలిటీ హోదా రాగా.. అనేక కొత్త మండలాలు, హామ్లెట్‌ గ్రామాలకు గ్రామపంచాయతీ హోదా దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement