పాలనను ప్రజల చెంతకు చేర్చిందే కేసీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

పాలనను ప్రజల చెంతకు చేర్చిందే కేసీఆర్‌

Oct 11 2026 12:27 AM | Updated on Oct 11 2026 12:27 AM

● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి: పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించి పరిపాలనను ప్రజల చెంతరకు చేర్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం పెద్దపల్లిలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. రైతులు సాగునీరు, విద్యుత్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుతం రైతు భరోసా, తదితర హామీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్‌ పాలనా వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌, మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్‌, వంగల తిరుపతిరెడ్డి, సందీప్‌రావు పాల్గొన్నారు.

‘తడి’కోసం తండ్లాట

పెద్దపల్లిరూరల్‌: సాగునీటి కోసం రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. బావులు, బోరు నుంచి నీటిని తోడేందుకు ఏర్పాటు చేసుకున్న మోటార్లు లోవోల్టేజీతో కాలిపోతున్నాయని పెద్దపల్లి మండలం పెద్దకల్వలకు చెందిన పలువురు రైతులు వాపోయారు. కాలిపోయిన మోటార్లను శనివారం పొలాల వద్ద నెత్తిన పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పంట చేతికందే దశకు చేరుకున్న తరుణంలో లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి లోవోల్టేజీ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement