కార్మికులకు సొంతింటి కల సాకారం చేస్తాం పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ రద్దు చేస్తాం సింగరేణి కార్మికుల కోసం బరాబర్ పనిచేస్తాం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని: ‘సింగరేణి కార్మికుల సమస్యలు బరాబర్ పరిష్కరిస్తాం.. మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను ఏరియా వారీగా నిర్వహిస్తాం.. కార్మికుల సొంతింటి కల సాకారం చేస్తాం.. పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ చేయడంతోపాటు మారుపేరు కార్మికుల సమస్యను పరిష్కారిస్తాం’ అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. కార్మికుల లాభాల వాటా ప్రకటించే అవకాశం ఉందని, సీఎం కార్యాలయం నుంచి కబురువచ్చిందన్నారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేల సమావేశంలో గంటకుపైగా సింగరేణి కార్మికుల సమస్యలను తాను వివరించానని అన్నారు. కార్మికులకు సంతోషం వస్తే కడుపులో దాచుకుంటారని, ఆగ్రహం వస్తే ప్రతాపం కూడా చూపిస్తారని తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు చిట్‌చాట్ చేశారు.
ఏరియా ఆస్పత్రుల్లోనే మెడికల్ ఇన్వాలిడేషన్
ఇకనుంచి ఏరియా ఆస్పత్రుల్లోనే మెడికల్ ఇన్వాలిడేషన్ చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం 15శాతం ఉన్న ఇన్వాలిడేషన్‌ను 75శాతం పెంచాలని సూచించామని, ఈవిషయంలో వెనక్కితగ్గే ప్రసక్తేలేదన్నారు.
ఇన్‌కంట్యాక్స్ మాఫీచేస్తాం
దశాబ్దాలుగా కార్మికులు ఎదురుచూస్తున్న పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం అంగీకరించిందని ఠాకూర్ తెలిపారు. ఈవిషయంపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.
బకాయిల చెల్లింపు కోసం పట్టుబట్టాం
త్వరలోనే సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో సింగరేణి బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం నిర్ణయాలతోనే సింగరేణి దివాళా తీసే పరిస్థితికి చేరిందని విమర్శించారు.
సొంతింటి కల నెరవేరుస్తాం..
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఠాకూర్ అన్నారు. దూర ప్రాంతం హైదరాబాద్‌లో కాకుండా స్థానికంగానే నెహ్రూహౌసింగ్ కాలనీ పేరిట ఇళ్లు ఇస్తామన్నారు. 1,250 ఎకరాల్లోని సింగరేణి భూముల్లో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు.
క్యాన్సర్ స్క్రీనింగ్‌పై ప్రత్యేక దృష్టి..
కాలుష్య కాసారంగా మారిన రామగుండంలో కాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టాలని సమావేశం దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే అన్నారు. దీనిపై సింగరేణి చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపారు.
కార్మికుల భద్రతకు పెద్దపీట
కార్మికుల భద్రతకు పెద్దపీట వేయాలి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే ఠాకూర్ తెలిపారు. ఈవిషయంలో చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ అయ్యాయని స్పష్టం చేశారు.
15రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు
పెండింగ్‌లోని 300 వరకు పెండింగ్ డిపెండెంట్ కేసులను పరిశీలించి 15 రోజుల్లోగా నియామక ఉత్తర్వులు జారీచేసేలా చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకెళ్లామని మక్కాన్‌సింగ్ తెలిపారు. మారుపేర్ల సమస్యను కూడా ప్రస్తావించామన్నారు. వివిధ కారణాలతో విధులకు గైర్హాజరై ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల సమస్యను కూడా ప్రభుత్వం పరిశీలించిందని వెల్లడించారు. ఇలాంటి వారిని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా తిరిగి ఉద్యోగావకాశం కల్పించాలని సూచించామన్నారు. సింగరేణి ఆస్పత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని కోరామన్నారు.


