అభివృద్ధికి ఎన్టీపీసీ సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఎన్టీపీసీ సహకరించాలి

Oct 11 2026 12:33 AM | Updated on Oct 11 2026 12:33 AM

● మేయర్‌ మహంకాళి స్వామి

● ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ప్రాజెక్ట్‌ హెడ్‌గా బాధ్యతలు చేపట్టిన ఫయాజ్‌ తయ్యబ్‌ శనివారం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామగుండం ప్రాంత అభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సంస్థ సహకారంతో ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్ప న, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా యాజమాన్యం మరింత చొరవ చూపాలని కోరారు. సంస్థ సహకారంతో రామగుండం ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేటీఆర్‌ సభ స్థలం పరిశీలన

గోదావరిఖని: గోదావరిఖనిలో ఈనెల 14న బహిరంగ సభ ఖరారైన నేపథ్యంలో మాజీ మంత్రి, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్‌ సభాస్థలాన్ని పరిశీలించారు. ముందుగా స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్‌లో సభ నిర్వహించాలని నిర్ణయించినా, గ్రౌండ్‌ చిన్నగా ఉండటంతో జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని, ఈమేరకు ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేయాలని నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, బాల్క సుమన్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తదితరులున్నారు.

నగరంలో 24 గంటలు నీటి సరఫరా లక్ష్యం

కోల్‌సిటీ(రామగుండం): నగరంలో భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా, 24 గంటల పాటు సరఫరా చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి తెలిపారు. 8 ఉపరితల జలాశయాల నిర్మాణానికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. నగరంలోని 57వ డివిజన్‌ కాకతీయనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఉపరితల జలాశయ పనులను డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్యతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో జలాశయాలు, పైపులైన్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. ఇతర అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే మరో రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించారని, సంబంధిత అనుమతులు వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. కార్పొరేటర్లు ముస్తఫా, గట్ల రమేశ్‌, వెంగళ బాపు, నగరపాలక ఏఈ మనోజ్‌, పర్యవేక్షకుడు శశికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అబ్బాపూర్‌లో మద్యం విక్రయాలు నిషేధం

జూలపల్లి: మండలంలోని అబ్బాపూర్‌లో శనివారం నుంచి మద్యం నిషేధం ప్రారంభమయ్యింది. పదిరోజుల క్రితం గ్రామస్తులు, పాలకవర్గ సభ్యులు సమావేశం నిర్వహించిన గ్రామంలో మద్యం బంద్‌ చేయాలని ముక్తకంఠంతో కోరారు. దీంతో సర్పంచ్‌ దండె వెంకటేశ్వర్లు అధ్యక్షతన పాలకవర్గ సమావేశంలో ఈ నెల 10 నుంచి గ్రామంలో ఎవరూ మద్యం అమ్మకూడదని తీర్మానించారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.5 వేల జరిమానా ఉంటుందని బెల్ట్‌షాపుల నిర్వాహకులకు తెలిపారు. దీంతో గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement