లెవల్‌క్రాసింగ్ గేట్ల ఇబ్బందులు తొలగించేందుకు రైల్వే శాఖ అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తోంది. కానీ, సమస్య పరిష్కరించాల్సిన వంతెనలు అనేక ఇబ్బందుల్ని సృష్టిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే కొత్తపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జి. ఇక్కడి ఓదెల, కాల్వశ్రీ రాంపూర్ మండలాలతోపాటు జమ్మికుంట, వరంగల్ జిల్లాకు వెళ్లేందుకూ ఇదికూడా ప్రత్యామ్నాయ మార్గం. కానీ, వర్షాకాలం వచ్చిందంటే అండర్ బ్రిడ్జిలోకి వరద చేరి రాకపోకలు స్తంభిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి చేరుకోవడం తలకుమించిన భారమవుతోందని ఓదెల మండలం కొలనూర్, పెద్దపల్లి మండలం మూలసాల, కొత్తపల్లి, దస్తగిరిపల్లి, పెద్దబొంకూర్, పెద్దకల్వల తదితర గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
కొత్తపల్లి వాసుల్లో చెప్పలేని వేదన..
అండర్ బ్రిడ్జితో కొత్తపల్లివాసులకు సరికొత్త తిప్పలు ఎదురయ్యాయి. ఇప్పటికే ఉన్న లెవల్ క్రాసింగ్ గేటు మూసివేయొద్దని గ్రామస్తులు మొరపెట్టుకున్నా వినకుండా ఉన్నతాధికారులు అండర్‌బ్రిడ్జి నిర్మించారు. అప్పట్నుంచే సమస్య జటిలమైంది. కొద్దినెలల క్రితం కురిసిన వానలకు వంతెనలోకి వరదచేరి వ్యవసాయ పనులకోసం వెళ్తున్న ట్రాక్టర్ మునిగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి.
పెరిగిన దూరభారం
కొత్తపల్లిలో రైల్వే గేటును శాశ్వతంగా మూసివేయడంతో ఎటూ వెళ్లాలన్నా కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అండర్‌బ్రిడ్జిపై సబ్‌వే నిర్మాణ లోపమే ఇందుకు కారణమంటున్నారు గ్రామస్తులు. పైన నిలిచిన వర్షపునీరు బయటకు వెళ్లకుండా నేరుగా అండర్‌బ్రిడ్జిలోకి చేరుతోందని, విద్యుత్ మోటార్లు బిగించి బయటకు పంపిస్తున్నారని వివరించారు. ఇందుకోసం ఓ ఉద్యోగిని నియమించిన అధికారులు.. అదే రైల్వేక్రాసింగ్ గేటు వద్ద ఉంచితే సమస్య తలెత్తేదికాదంటున్నారు.
వరదనీటిని తోడేస్తున్న మోటార్లు
అండర్ బ్రిడ్జిలోకి చేరిన వరదనీరు
నరకం చూపుతున్న ‘కొత్త’పల్లి రైల్వే అండర్ బ్రిడ్జి
రెండు జిల్లాల ప్రజలకు రాకపోకలు బంద్
అధికారులకు విన్నవించినా చర్యలు శూన్యం
అది మారుమూల పల్లెకాదు.. జిల్లా కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.. ఒకవైపు హుస్సేనిమియావాగు, మరోవైపు మూడుట్రాక్‌లు కలిగిన రైల్వేలైన్లు.. చిన్నపాటి వర్షానికే రాకపోకల్ని స్తంభింపజేసే రైల్వేఅండర్ బ్రిడ్జి.. ఎటు వెళ్లాలన్నా పల్లెవాసులకు ఇవి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.
– పెద్దపల్లిరూరల్


