ఆపితే దొంగలపాలు
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలోనే అత్యధిక ఖరీదైన అతిభారీ యంత్రాలు పృథ్వీభంజన్, భీమా ఏళ్లుగా నిరుపయోగంగా పడిఉంటున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లో ఉన్న ఈ రెండు డ్రాగ్‌లైన్ల జీవితకాలం పూర్తి కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నాయి. స్క్రాప్‌గా విడదీసి విక్రయిస్తే సంస్థకు రూ.కోట్లలో ఆదాయం వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే, పర్చేజ్, మైనింగ్ తదితర విభాగాల మధ్య సమన్వయం లేక ఏళ్లుగా ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ తుప్పుపడుతున్నాయి. మరికొన్ని విడిభాగాలు దొంగల పాలవుతున్నాయి.
30 ఏళ్లపాటు సేవలు
సింగరేణికి దాదాపు 30ఏళ్ల పాటు సేవలు అందించిన డ్రాగ్‌లైన్ యంత్రాలను కోల్‌ఇండియాకు లేదా ఆన్‌లైన్‌లో టెండరు ద్వారా విక్రయిస్తే సుమారు రూ.5కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే యంత్రపరికరాలు, యంత్రాలు పాడైపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
డ్రాగ్‌లైన్ల పేర్లు పృథ్వీభంజన్, భీమా..
సింగరేణి బొగ్గు గనుల సంస్థలో పృథ్వీభంజన్, భీమా డ్రాగ్‌లైన్‌లు అందుబాటులోకి రావడంతో ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో ఓబీ(ఓవర్ బర్డెన్–మట్టి) తొలగింపు, బొగ్గు వెలికితీత ప్రక్రియలో విప్లవం వచ్చింది. 1986లో రూ.100కోట్లతో కొనుగోలు చేసిన పృథ్వీభంజన్‌లో ఓసీపీ–1లో ప్రవేశపెట్టారు. అప్పటి సీఎం ఎన్టీ రామారావు దానిని ప్రారంభించారు. 1994లో భీమా డ్రాగ్‌లైన్‌ను ప్రత్యేకంగా ఓబీ వెలికితీతకోసం కొనుగోలు చేసింది. ఆర్జీ–2 ఏరియాలోని ఓసీపీ–3లో దీనిని ప్రవేశపెట్టారు. సుమారు 30 ఏళ్లపాటు నిర్విరామంగా పనిచేసింది. ప్రస్తుతం ఈరెండు యంత్రాల జీవిత కాలం ముగిసింది. యంత్రాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా యంత్రాల కదలికలకు అవసరమైన పనిస్థలాలు లేక మూలనపడ్డాయంటున్నారు.
కోలిండియాలో 58 యంత్రాలు
సింగరేణిలో డ్రాగ్‌లైన్లు రెండే ఉండగా.. జీవితకా లం ముగియడంతో పక్కనపెట్టారు. ఇలాంటి యంత్రాలు కోలిండియాలో 58కిపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సింగరేణిలోని డ్రాగ్‌లైన్లను వి డిభాగాలు విభజించి విక్రయిస్తే రూ.కోట్ల ఆదా యం వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం సుమా రు రూ.20 లక్షలు వ్యయం చేస్తే సరిపోతుందని అధికారులు వివరిస్తున్నారు ఈదిశగా సీఎండీ చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
నిరుపయోగంగా భారీ యంత్రాలు
చోరీకి గురవుతున్న విడిభాగాలు
విశ్రాంతి తీసుకుంటున్న డ్రాగ్‌లైన్లు
నిర్లక్ష్యం వహిస్తున్న సింగరేణి


