న్యూస్‌రీల్
పెద్దపల్లి: సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు పారిపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల భద్రత, బాధ్యతలు నిర్వహించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందనే చర్చ సాగుతోంది. గతనెల 28న రాత్రి ఇద్దరు బాలికలు చిల్డ్రన్ హోమ్ నుంచి పారిపోయిన విషయం విదితమే. నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో గాలింపు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు బాలికల ఫొటోలు పంపించి అప్రమత్తం చేశారు. దీంతో 24 గంటల్లోపే నల్గొండ జిల్లాలో బాలికలను గుర్తించి సురక్షితంగా చిల్డ్రన్ హోమ్‌కు తరలించారు.
అప్రమత్తంగా లేక..
వాచ్‌ఉమన్ లేకనేనా?
చిల్డ్రన్ హోమ్‌లోని వాచ్‌ఉమెన్ తన సమీప బంధువు మృతి చెందడంతో ఆరోజు సెలవులో వెళ్లినట్లు సూపరింటెండెంట్ వనిత తెలిపారు. దీంతో ఇద్దరు ఉద్యోగులకు ఆ విధులు కేటాయించారు. రాత్రి వేళల్లో విద్యార్థినులు బయటకు వెళ్లకుండా పర్యవేక్షించాల్సిన వాచ్‌ఉమెన్, సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే బాలికలు తప్పించుకునే అవకాశం లభించిందని ఉద్యోగుల మధ్య చర్చ సాగుతోంది. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా బాధ్యులపై ఇంకా చర్యలు తీసుకోకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కాగా, చిల్డ్రన్ హోమ్‌లో 54 మంది విద్యార్థులు ఉండగా.. ఆదివారం నాటికి అందులో 24మంది ఉన్నారని సూపరింటెండెంట్ వనిత తెలిపారు.
విచారణ కొనసాగుతోంది
చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు పారిపోయిన ఘటనపై విచారణ చేపట్టాం. సిబ్బంది అరుణ, మమత విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమిక విచారణ తేలింది. పూర్తిస్థాయి విచారణ తర్వాత నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం. చిల్డ్రన్ హోమ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
– జితేందర్, డీసీపీవో, పెద్దపల్లి
చిల్డ్రన్ హోమ్ నుంచి బాలికల పరారీ..
సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా?
వాచ్‌ఉమెన్ బాధ్యతలపై అనేక అనుమానాలు
విచారణ జరుపుతున్న అధికారులు


