జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం పూలతో స్వాగతం పలికిన టీచర్లు అమావాస్య కావడంతో తగ్గిన విద్యార్థులు సెంటిమెంట్‌తో వెలవెలబోయిన తరగతి గదులు
సాక్షి,పెద్దపల్లి: సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు సోమవారం విద్యార్థుల కిలకిలరావాలతో కళకళలాడాల్సి ఉండగా, తొలిరోజు వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా కనిపించింది. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా అనేక పాఠశాలల్లో తరగతి గదులు సగానికి పైగా ఖాళీగా కనిపించాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకున్నప్పటికీ విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో లేదు. దీనికి ప్రధాన కారణం సోమవారం వచ్చిన అమావాస్య కావడమేనని తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా కేవలం 20 శాతం మాత్రమే హాజరు నమోదైందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 743 పాఠశాలలుండగా, వీటిలో సుమారు 1.46 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
స్కూళ్లలో పండుగ వాతావరణం.. కానీ
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు మాత్రం మొదటి రోజే బడులకు హాజరయ్యారు. పాఠశాలలను శుభ్రం చేసి, ముస్తాబు చేసి విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాకపోవడంతో ఉపాధ్యాయులు నిరాశకు గురయ్యారు. ఏటా పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు ఘన స్వాగతం పలుకుతాం. కానీ, ఈసారి అమావాస్య తిథి రావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపలేదు. రేపటి నుంచి హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
పూలు అందించి స్వాగతం
జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందించి స్వాగతం పలికారు. అనంతరం మొదటిరోజు వచ్చిన విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పాఠశాలల్లో చేర్పించేందుకు వచ్చి వివరాలు సేకరించి వెళ్లారు.
సిలబస్‌పై అవగహనకే..
తొలిరోజు హాజరు తక్కువగా ఉండటంతో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా ప్రణాళికలు, కొత్త సిలబస్ గురించి అవగాహన కల్పించడానికే పరిమితమయ్యారు. పూర్తిస్థాయిలో బోధన కార్యక్రమాలు బుధవారం నుంచి ఊపందుకునే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.


