● యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
గోదావరిఖని: కార్మిక వర్గ శ్రేయస్సు, హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న ఏఐటీయూసీని విమర్శిస్తే ఊరుకోబోమని ఆ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ ఉద్యమానికి సంఘీభావం తెలిపి కార్మికుల ఐక్యతను చాటాలని వారు కోరారు. సింగరేణిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సేవ్ సింగరేణి పోరుజాత కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుండా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అందుకే పోరుబాట ఎంచుకున్నామని వారు అన్నారు. దీనిపై ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌లు కార్మిక వర్గాన్ని బలహీన పర్చేలా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈనెల 30 వరకు జాతా కొనసాగుతుందని, చివరగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట వంటావార్పు, ముట్టడితో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్‌లో సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వీరభద్రం, ముస్కె సమ్మయ్య, సంకె అశోక్, రంగు శ్రీను, విజయలక్ష్మి, ఎంఏగౌస్ తదితరులు పాల్గొన్నారు.
గనులపై గేట్ మీటింగ్‌లు
సేవ్ సింగరేణి పోరుజాత కార్యక్రమంలో భాగంగా ఆర్జీ–1 ఏరియాలోని అన్ని గనులపై ఏఐటీయూసీ నాయకులు గేట్ మీటింగ్‌లు నిర్వహించారు. సంస్థ స్థితిగతులపై కార్మికులకు వివరించారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.


