ఆర్టీసీలో సమ్మె సైరన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

Mar 24 2026 6:58 AM | Updated on Mar 24 2026 6:58 AM

డిమాండ్లు

కరీంనగర్‌టౌన్‌: సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. రెండున్నరేళ్లుగా తమ వినతులను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామంటూ ఇటీవల హైదరాబాద్‌లో ఎండీ వై.నాగిరెడ్డికి సమ్మె నోటీస్‌ అందజేయడంతో చాలా రోజుల తర్వాత ఆర్టీసీలో జంగ్‌ సైరన్‌ మోగనుంది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జేఏసీ నాయకులు సమ్మె నోటీసు ఇవ్వడంతో కరీంనగర్‌ రీజినల్‌ పరిధిలోని 11 డిపోలలో ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.

11 డిపోలు, 972 బస్సులు

ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్‌ రీజినల్‌ పరిధిలో కరీంనగర్‌– 1, కరీంనగర్‌ 2, హుస్నాబాద్‌, హుజురాబాద్‌, మంథని, గోదావరిఖని, వేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, సిరిసిల్ల డిపోలలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు ఇతర సిబ్బంది మొత్తం 3,236 మంది సమ్మెలోకి వెళ్లనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అవసరమైతే నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టి తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తేనే రవాణా సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని, లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

ప్రభుత్వంలో విలీనానికి నోటీసు

ఈనెల 26 తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధం

ఇటీవల జేఏసీ ఆధ్వర్యంలో ఎండీకి నోటీస్‌

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 2017 నుంచి అలవెన్స్‌, బెనిఫిట్స్‌, వేతన సవరణ బకాయిలు చెల్లించాలి.

రిటైర్డ్‌ ఉద్యోగులకు 2017 వేతన సవరణ అమలు చేయడం, 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్‌ చేయడం. 2025 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి.

మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్‌ బదులు మహిళలకు స్మార్ట్‌ కార్డు ఇవ్వాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతినెలా కోత విధించకుండా రూ.400కోట్లు ఇవ్వాలి.

పాత బకాయిలు రూ.2,500 కోట్లు చెల్లించాలి. అన్ని కేటగిరిల్లో ఖాళీలు భర్తీచేసి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రతీ కార్మికుడికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్‌ ఇవ్వాలి.

ఉద్యోగి కుటుంబానికి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సౌకర్యం కల్పించాలి. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్‌ కాబోతున్న ఉద్యోగులకు ఆదేరోజు సెటిల్మెంట్‌ మొత్తం చెల్లించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement