వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్
ఓ వివాహ వేడుకకు హాజరుకానున్న మాజీ సీఎం
విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నా రు. ఈ మేరకు పర్యటన వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పార్టీ జిల్లా కార్యాల యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. భోగాపురం మండల కేంద్రంలో పార్టీ నాయకుడు ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుక కోసం ఆ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా సమీపంలోని సన్‌రే రిసార్ట్స్‌కు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అంతకుముందు విమానాశ్రయంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులంతా ఘన స్వాగతం పలకనున్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4.15 గంటలకు సన్ రే రీసార్ట్స్ నుంచి బయలుదేరి ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం నేరుగా బెంగుళూరు పయనమవుతారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన పార్టీశ్రేణులంతా విజయవంతం చేయాలని బెల్లాన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి గదల సన్యాసినాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంత్, పూసపాటిరేగ మండలాధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, పార్టీ నాయకులు డోల మన్మథకుమార్, సముద్రపు రామారావు, తదితరులు పాల్గొన్నారు.


