చిన్నశ్రీనుకు వనవాసమే..! | - | Sakshi
Sakshi News home page

చిన్నశ్రీనుకు వనవాసమే..!

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

● మేయర్‌, జెడ్పీచైర్మన్‌ అంటూ భారీ ‘ట్రైలర్‌’...

● చివరకు అరకులో ’సైడ్‌ రోల్‌’తో సరి

● కేడర్లో నైరాశ్యం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జింకులో కావాలా.. బంకులో కావాలా.. స్టీల్‌ ప్లాంటా.. షిప్‌యార్డా అని అన్నీ అడిగి చివరకు ముంబై రోడ్ల మీద పావ్‌బజ్జీ దుకాణం పెట్టించిన పట్నాయక్‌ సీన్‌ గుర్తుంది కదా.. అచ్చం జెడ్పీ మాజీ చైర్మన్‌ చిన్న శ్రీను పరిస్థితి కూడా అలాగే అయింది. ఆయన టీడీపీలో చేరగానే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఇస్తారన్నారు.. రెండ్రోజులు గడిచాక అబ్బబ్బ అదికాదు మేయర్‌ అన్నారు... అది కాకపోయినా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ ఇచ్చి మూడు జిల్లాలను లాక్కొచ్చే పని అప్పగిస్తారన్నారు.

అలాంటి ప్రోమోలు వేసి జిల్లాలో అక్కడక్కడ కొద్దిమంది వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను టీడీపీలో చేర్చుకున్నారు..

ప్రోమో వరకు బాగానే ఉంది కానీ అసలు సినిమా రిలీజ్‌ అయ్యేసరికి సీన్‌ అర్థమైపోయింది. ఆయనది మెయిన్‌ క్యారెక్టర్‌ కాదు సైడ్‌ రోల్‌ అని తెలిసేసరికి ఆయన అనుచరులకు దెబ్బడిపోయింది.

అరకు పరిశీలకుడిగా ఏం చేస్తారు...

ఇప్పటికే అరకు టీడీపీ పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా తేజోవతి ఉన్నారు. ఆమె ఇప్పటికే సాలూరు, పాలకొండ , కురుపాం, అరకు.. పాడేరు ప్రాంతాల్లో విస్తృతంగా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో ఏదో చోట నుంచి టిక్కెట్‌ తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆమెకు సహాయకుడి పాత్రలో పరిశీలకుడిగా నియమితులైన చిన్నశ్రీను అక్కడ ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేదానిపై క్యాడర్లో ఉన్న మబ్బులు తొలగిపోయాయి.

మేయర్‌.. జెడ్పీ.. జిల్లా పోస్ట్‌.. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ అనే స్థాయి నుంచి ఏకంగా మన్యం నియోజకవర్గానికి పంపడం అంటే ఆయన స్థాయిని తగ్గించడమా? కాదా? అనేది ఇప్పటికే జనాలకు అర్థమైపోయింది.

అడవి బాట...

రాజవుతాడుకున్న రాముడు కై క పుణ్యాన వనవాసం పేరిట అడవుల బాట పట్టినట్టు.. జిల్లా అధ్యక్షుడవుతాడనుకున్న చిన్నశ్రీను మన్యం బాట పట్టాల్సి వచ్చిందన్నది ఇప్పుడు జిల్లాలో సాగుతున్న చర్చ. ఇక మన్యం ఏజన్సీ ప్రాంతాల నుంచి ఆయనకు నిష్కృతి ఎప్పుడన్నది అధినేత చంద్రబాబుకు తప్ప ఎవరికి తెలియదు. టీడీపీలో చేరినప్పుడు ఆయనకు ఇచ్చిన ఎలివేషన్లకు.. క్యాడర్లో కల్పించిన ఆశలకు ఇప్పుడు ప్రాక్టికల్‌గా కనిపిస్తున్న దానికి బోల్డంత తేడా కనిపిస్తోంది.

అయోమయంలో క్యా‘డర్‌ ’..

గతంలో చిన్నశ్రీను స్థాయి వేరు... పరిసరాల్లోని అన్నిజిల్లాల నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ ఆయన ఇంటికి వచ్చి ప్రసన్నం చేసుకునేవారు. అదే స్థాయి గుర్తింపు, ప్రాధాన్యం దక్కుతుంది. ఆయన వెంట నడిస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే ఆశతో కొంతమంది ఆయన వెంట నడిచారు. అయితే, ఇప్పుడు వారి భ్రమలు తొలగుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు అవుతాడునుకున్న తమ నేత జిల్లా సరిహద్దుల అవతలకు విసిరేయబడితే ఇక తమ స్థాయి.. తమకు ఎలాంటి గుర్తింపు వస్తుంది? అక్కడికెళ్లి ఏం బావుకుంటాం అనే మీమాంస ఆయన అనుచరుల్లో నెలకొంది.

లీడ్‌ రోల్‌ అన్నారు...

సైడ్‌ క్యారెక్టర్‌తో సరిపెట్టారు..

పార్టీలో చేరగానే ప్రధాన బాధ్యతలు ఇస్తారని ప్రచారం చేశారు. కోరుకున్న పదవి.. బాధ్యత ఇచ్చి ఆయనను ముందు పెట్టీ టీడీపీ జిల్లా రాజకీయాలు నడిపిస్తారని అన్నారు. తీరా చూస్తే ఆయనను కానరాని కానలకు పరిశీలకుడిగా వేసి గెస్ట్‌ పాత్రకు పరిమితం చేశారు. ట్రైలర్లో చూపించిన ఎలివేషన్‌ సీన్లన్నీ ఎడిటింగ్‌లో కట్‌ అయిపోయినట్లు అయిందని ఆయన అనుచరులు కొందరు లోలోన ఫీలవుతుండగా, పెద్దదో..చిన్నదో..గుర్తింపు ఉన్నదో లేనిదో ఏదో ఒకటి ఇచ్చారులే.. లేనిబావ కన్నా గుడ్డిబావ నయం అన్నట్లుగా మరికొందరు సమాధానపర్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement