రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

పద్మనాభం: మండలంలోని కృష్ణాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ ఎం.చంద్రమౌళి శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన షేక్‌ తాజ్‌ ఖాన్‌ (29) శుక్రవారం ద్విచక్ర వాహనంపై తగరపువలస వైపు వెళ్తుండగా, కృష్ణాపురం వెంగమాంబ క్వారీ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తాజ్‌ఖాన్‌కు బలమైన గాయాలవడంతో, వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పల్లంటి కొండలరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు.

అత్తింటి వేధింపులపై కేసు నమోదు

పూసపాటిరేగ : భోగాపురం మండలంలోని దల్లిపేట గ్రామంలో భర్తపై భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. గ్రామానికి చెందిన దల్లి చిట్టిలక్ష్మిని ఆమె భర్త దల్లి రామచంద్రరావు నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తుండడంతో పాటు అత్త మామలు అదనపు కట్నం కోసం తరుచూ ఇబ్బంది పెట్టంతో భోగాపురం పోలీస్‌స్టేషన్‌లో చిట్టి లక్ష్మి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కూన దుర్గాప్రసాద్‌ తెలిపారు.

యువకుడి అదృశ్యం

చీపురుపల్లి రూరల్‌(గరివిడి): గరివిడి పట్టణంలో సుంకర దినేష్‌కుమార్‌(22) అనే యువకుడు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గరివిడి పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వెనుక కుటుంబ సభ్యులతో కలిసి దినేష్‌కుమార్‌ నివాసం ఉంటున్నాడు. నెల్లిమర్లలోని మిమ్స్‌ కళాశాలలో ఫిజియోథెరపి కోర్సు చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన దినేష్‌కుమార్‌ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటుగా బంధువుల ఇళ్ల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ మేరకు దినేష్‌కుమార్‌ తండ్రి సుంకర సుధాకర్‌ గరివిడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భర్త అదృశ్యంపై భార్య ఫిర్యాదు

రాజాం సిటీ: రేగిడి మండలం కోడిశ గ్రామానికి చెందిన కాయల శివుడు కనిపించడం లేదని అతని భార్య లక్ష్మి ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ మహ్మద్‌ సల్మాన్‌బేగ్‌ శనివారం తెలిపారు. పశువుల వ్యాపారం చేస్తున్న శివుడు ఈ నెల 8న సమీప బంధువైన కాయల సాంబయ్యతో కలిసి పశువుల విక్రయానికి రాజాం వచ్చారు. పని పూర్తయిన తరువాత సాంబయ్య స్వగ్రామం చేరుకోగా శివుడు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

విజయనగరం టౌన్‌: మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి టూ టౌన్‌ పోలీసులు శనివారం అందించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక కొత్తపేట గొల్లవీధికి చెందిన యర్ర జశ్వంత్‌ (18) ఇంటర్‌మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫెయిలయ్యాడు. దాంతో మరి చదవనని ఇంట్లోనే ఉంటూ ఎవరితోనూ మాట్లాడకుండా, మానసికంగా బాధపడేవాడు. భోజనం కూడా సరిగ్గా చేయకుండా ఉండడంతో పలుసార్లు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లోనే బెడ్‌ రూమ్‌లో సీలింగ్‌ ప్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతుని తల్లిదండ్రులు యర్ర ప్రసాద్‌, సుజాత ఫిర్యాదు మేరకు టూ టౌన్‌ సీఐ టి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

భామిని: భామిని వయా లివిరి రహదారిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూలగూడకు చెందిన బిడ్డిక కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణ తన స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మండల కేంద్రానికి వస్తుండగా రహదారిపై ఉన్న గోతులు తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. అక్కడి వారు 108కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుని తొలిత భామిని పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఈయనను మెరుగైన వైద్యం కోసం సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement