సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ప్రజల జీవనాడిలాంటి జంఝావతి ప్రాజెక్టుకు దశాబ్దాలుగా మోక్షం కలగడం లేదు. ఒడిశా ప్రభుత్వం ససేమిరా అనడం.. రాష్ట్రంలోని కూటమి పాలకులకు చిత్తశుద్ధి కొరవడడం వల్ల వేలాది మంది రైతులకు సాగు, తాగునీటి కష్టాలు తప్పడం లేదు. జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం 19 రోజులుగా పార్వతీపురంలో ‘జంఝావతి సాధన కమిటీ’ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపడుతున్నారు. కమిటీ ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నేతలు గొంతు చించుకుంటున్నా.. ఏ ఒక్క ప్రజాప్రతినిధి నుంచి కూడా కనీస స్పందన ఉండడం లేదు. సుమారు 75 గ్రామాల రైతుల సాగు, తాగునీరు అవసరాలు తీరడానికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం. ఇది పూర్తయితే పార్వతీపురం పట్టణానికి దశాబ్దాల నీటి సమస్య కూడా తీరుతుంది.
ఒడిశా మడత పేచీ..
జిల్లాలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో నిర్మించతలపెట్టిన జంఝావతి జలాశయం నిర్మాణం ఐదు దశాబ్దాలుగా అసంపూర్తిగానే మిగిలిపోయింది. రెండు రాష్ట్రాల జల వివాదాలతో ముందుకు అడుగులు పడడం లేదు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీ అమలు కార్యరూపం దాల్చడం లేదు. ఏటా అంచనా వ్యయం పెరుగుతోంది. జిల్లాలోని కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద నాగావళి నదిపై జంఝావతి జలాశయం నిర్మించాలని 1975లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 26,640 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.13.50 కోట్లతో ప్రతిపాదించారు. ఒడిశా అడ్డంకులతో నిలిచింది. గతంలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి దీన్ని జలయజ్ఞంలో చేర్చారు. 2006లో ఆస్ట్రియా సాంకేతికతతో తాత్కాలికంగా రైతులకు సాగు నీరందించేందుకు రూ.5 కోట్ల ఖర్చుతో రబ్బర్ డ్యామ్ నిర్మించారు. కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి, మక్కువ, పార్వతీపురం మండలాల్లో సుమారు 12 వేల ఎకరాలకు నీరందించేందుకు కాలువలు నిర్మించాలి. అప్పట్లోనే ఒడిశా ప్రభుత్వం మోకాలడ్డింది. జంఝావతి నది నుంచి నాలుగు టీఎంసీల నీటిని వినియోగించుకొనేలా జలాశయానికి రూపకల్పన చేశారు. ఇది పూర్తయితే ఒడిశాలోని 1,175.10 ఎకరాలు ముంపునకు గురవుతాయి. 848.76 ఎకరాలు ప్రభుత్వ అటవీ భూములు కాగా.. 326.34 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినవి. నాలుగు గ్రామాలు పూర్తిగా, ఆరు గ్రామాలకు పాక్షికంగా ఇబ్బంది ఎదురవుతోంది. దాదాపు 189 కుటుంబాలు నిర్వాసితులవుతాయి. పునరావాసం కల్పన, నష్టపరిహారం చెల్లింపునకు అప్పటి ఏపీ ప్రభుత్వం అంగీకరించినా ఒడిశా మడతపేచీతో అక్కడే ఆగిపోయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఒడిశా ప్రభుత్వంతో స్వయంగా చర్చలు జరిపారు. అటు నుంచి సానుకూలత రాకపోవడంతో ముందుకు అడుగులు పడలేదు.
పెరిగిన అంచనా వ్యయం.. ఇదే సమయం
ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. కొంత మేర కుడి, ఎడమ కాలువలు పనులు పూర్తి చేసినా.. అనుసంధాన పనులు విడిచిపెట్టారు. కొమరాడ మండలం డంగభద్ర దగ్గర కాలువలో రాతిబండ కూడా పెద్ద ఆటంకంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీతో కలిసిన కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఒడిశాలోనూ బీజేపీ ప్రభుత్వానిదే అధికారం. కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉండడం సానుకూల అంశం. ఇరు ప్రభుత్వాలూ కూర్చొంటే ప్రాజెక్టుకు అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయని ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు.
జంఝావతి ప్రాజెక్టు పూర్తిచేయాలని రైతుల డిమాండ్
19 రోజులుగా రిలే నిరాహార దీక్షలు
పాలకుల నుంచి స్పందన శూన్యం


