● ప్రభుత్వం కొనేది లేదు..
● దళారీలను ఆశ్రయించక తప్పదు..
● నష్టపోతున్న రైతులు
భామిని: చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతను నిలువెల్లా మోసం చేస్తూనే ఉంది. తాజాగా ఇందులో మొక్కజొన్న సాగు రైతులు కూడా చేరారు. ఇటీవల పంటలకు ఈ క్రాప్ నమోదు చేయాలని చెబుతూనే ఉన్నారు. అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతు పంటలను ఈ క్రాప్ కూడా చేయించారు. అయితే ప్రస్తుతం మొక్కజొన్న పంట కోత దశకు వచ్చింది. మిషన్లతో సేకరించిన జొన్న గింజలు ఆరపోతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కనీసం మద్దతు ధర చెల్లించే ప్రయత్నం చేయడం లేదు. ఇదే విషయమై వ్యవసాయాధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం ఉండడం లేదు. ఇటీవల అర్నబ్ తుఫాన్ తరువాత జొన్న పంట అమ్మకానికి వచ్చేసరికి మద్దతు వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారీలను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని దళారీలు, వ్యాపారులు కొనుగోలు ధరలను తగ్గించేస్తున్నారు. కళ్లాల్లో శ్యాంపిల్స్ తీసుకొని తక్కువ ధరకు పొందేలా బేరాలు ఆడుతున్నారని తప్పనిసరి పరిస్థితుల్లో విక్రయించక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో జగనన్న ప్రభుత్వంలో మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసింది. క్వింటాకు రూ.2,725లు చెల్లించింది. అదే ఆశతో ఇప్పుడు మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెంచారు. ఖరీఫ్‌లో మిగతా పంటల సాగు తగ్గించి మొక్కజొన్నపై రైతులు దృష్టి సారించారు. తీరా ఇప్పుడు విక్రయించే సరికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్రంగా నష్టపోతున్నాం..
నేను రెండున్నర ఎకరాల్లో జొన్న పంట వేశాను. ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని ఆశించాను. పండిన పంటకు గిట్టుబాటు ఉందని, మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాను. కూటమి ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నా. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జొన్న పంటకు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.
– అర్లి రాజు, రైతు, నేరడి
పంట మార్చి నష్టపోయా..
మెట్టు పంటలకు గిట్టుబాటు వస్తుందని ఆశించాను. దిగుబడి బాగుంటుందని మొక్కజొన్న సాగుపై దృష్టి పెట్టాను. నేను సాగు చేసే రెండు ఎకరాల గరు పుచ్చ సాగు మార్చాను. జగనన్న ప్రభుత్వం వలె జొన్న మద్దతు ధర వస్తుందని ఆశించాను. మరో ఎకరం భూమి కౌలుకు తీసుకొని మూడు ఎకరాలు మొక్కజొన్న పంట వేశాను. కూటమి ప్రభుత్వం మద్దతు ధర చెల్లించక పోవడంతో నష్టాల పాలవుతున్నాను. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, ప్రభుత్వ తోడ్పాటు అందించక తీవ్రంగా నష్టపోతున్నాం.
– కిల్లారి లక్ష్మీనారాయణ, రైతు, ఘనసర


